Begin typing your search above and press return to search.

ట్యాబులతో కాకినాడ‌లో తిరుగుతున్న‌దెవ‌రు?

By:  Tupaki Desk   |   27 Aug 2017 6:24 AM GMT
ట్యాబులతో కాకినాడ‌లో తిరుగుతున్న‌దెవ‌రు?
X
కొత్త బూచాళ్లు వ‌చ్చేశారు. ఏపీలో ఎన్నిక‌లు ఎక్క‌డ జ‌రుగుతుంటే అక్క‌డికి వ‌చ్చేస్తున్నారు ట్యాబుల బూచోళ్లు. ఇంత‌కీ వాళ్ల‌ను బూచాళ్లు అని ఎందుకు అనాల్సి వస్తుందంటారా? స‌మాచారాన్ని దోచేస్తున్నారు. వీరి వివ‌రాలు బ‌య‌ట‌కు రాకున్నా.. వీరి వ్య‌వ‌హార‌శైలి మాత్రం అనుమానాస్ప‌దంగా ఉండ‌ట‌మే. జ‌నాభిప్రాయం పేరుతో తిరుగుతున్న వీళ్లు.. ప్ర‌తి ఇంటికి వెళ్లి.. ఓటు ఎవ‌రికి వేస్తార‌న్న విష‌యాన్ని అడ‌గ‌టం.. ఒక‌టికి రెండు ప్ర‌శ్న‌లు వేసి మ‌రీ వారి నుంచి స‌మాచారాన్ని రాబ‌డుతున్న తీరుపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇంత‌కీ ఈ ట్యాబులోళ్లు ఎవ‌రు? ఎక్క‌డి వారు? ఏం చేస్తున్నారు? వీరి వెనుక ఉందెవ‌రు? ఎన్నిక‌లు జ‌రిగే చోట వారికేం ప‌ని? లాంటి ప్ర‌శ్న‌లు వేసుకుంటే.. కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మొన్న ముగిసిన నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఈ ట్యాబులోళ్ల సంద‌డి కొత్త‌గా క‌నిపించింది. ఓట‌ర్ల లిస్టు చేత‌ప‌ట్టి.. ఒక్కో ఇంటిని వెతుక్కుంటూ రావ‌ట‌మే కాదు.. వారి వివ‌రాలు స‌రి చూసుకోవ‌టం.. ఓట‌ర్ల పేర్లు.. వారి ఫోన్ నెంబ‌ర్లు తీసుకొని.. వారు ఎవ‌రికి ఓటు వేస్తార‌న్న ప్ర‌శ్న‌ను వేయ‌టం ఈ ట్యాబులోళ్ల ప‌నిగా చెబుతారు. వీరి ట్యాబుల్లో ఓట‌ర్ల లిస్టు ఉండ‌టం.. పేరు టైప్ చేసి.. తాము ప్ర‌శ్నిస్తున్న వారు క‌రెక్టేనా? కాదా? అన్న‌ది చెక్ చేసుకొంటున్న‌ట్లుగా తెలుస్తోంది.

అంతేనా.. ఏ రాజ‌కీయ పార్టీ అభివృద్ధి చేస్తుంద‌ని అనుకుంటున్నారు? బాబు పాల‌న మీద మేరేమ‌నుకుంటున్నారు? జ‌గ‌న్ తీరుపై మీ అభిప్రాయం ఏమిటి? ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మీరు ఓటు వేయాల‌నుకుంటున్నారు? ఇలా ప‌లు ప్ర‌శ్న‌ల్ని సంధిస్తూ.. వారి స‌మాధానాల్ని ట్యాబుల్లో నిక్షిప్తం చేస్తున్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న చోట ఏ సంస్థ కూడా ఈ త‌ర‌హాలో అభిప్రాయ సేక‌ర‌ణ చేయ‌కూడ‌దు.

కానీ.. అందుకు విరుద్ధంగా ట్యాబులు ప‌ట్టుకొని ప్ర‌తి ఇల్లూ తిరుగుతూ.. వివ‌రాలు సేక‌రిస్తున్న వైనంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక‌వేళ‌.. ఏదైనా సంస్థ అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌ట్టింద‌నుకుంటే.. ప్ర‌తి ఇంటికి వెళ్ల‌దు. ర్యాండ‌మ్ గా అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌డ‌తారు.

ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ ట్యాబులోళ్ల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు ఏమిటంటే.. అధికార‌పార్టీనే కొంద‌రిని రంగంలోకి దింపి.. ఎవ‌రు ఎవ‌రికి ఓటు వేస్తున్నారు? ఎవ‌రు అధికార‌ప‌క్షానికి అనుకూలంగా ఉన్నారు? ఎవ‌రు వ్య‌తిరేకంగా ఉన్నారు? లాంటివి తెలుసుకునేందుకు ఈ త‌ర‌హా దుర్మార్గానికి తెర తీసిన‌ట్లుగా ఆరోపిస్తున్నారు. త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న వారిని గుర్తించి..వారిని తాయిలాల‌కు.. ప్ర‌లోభాల‌కు లొంగ‌దీసుకోవ‌టం లేదంటే బెదిరింపుల‌కు దిగి త‌మ‌కు అనుకూలంగా ఓట్లు వేయించుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఇదే రీతిలో ట్యాబులోళ్ల‌తో అధికార‌ప‌క్షం వ్య‌వ‌హ‌రించింద‌ని.. తాజాగా కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ట్యాబులోళ్లు రంగ‌ప్ర‌వేశం చేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలా స‌మాచారం సేక‌రిస్తున్న వారిలో కొంద‌రిని కాకినాడ‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు నిల‌దీస్తే.. ఎన్నిక‌ల స‌ర్వే కోసం తాము కృష్ణా.. గుంటూరు జిల్లాల నుంచి వ‌చ్చిన‌ట్లుగా వెల్ల‌డించిన‌ట్లు చెబుతున్నారు.

డివిజ‌న్‌ కు ముగ్గురు చొప్పున మొత్తం 150 మంది ఇలా వ‌చ్చార‌ని చెబుతున్నారు. తాము ఈ త‌ర‌హా స‌మాచారం సేక‌రించినందుకు భోజ‌నం..వ‌స‌తి ఏర్పాటు చేసి రోజుకు రూ.400 ఇస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వీరిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా పోలీసులు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఈ ట్యాబులోళ్ల య‌వ్వారంపై ఇప్పుడు ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.