Begin typing your search above and press return to search.

బీజేపీ అక్కడ సీట్లు పెరుగతాయ్, అయినా ఆ పార్టీదే పైచేయి!

By:  Tupaki Desk   |   30 March 2019 8:23 AM GMT
బీజేపీ అక్కడ సీట్లు పెరుగతాయ్, అయినా ఆ పార్టీదే పైచేయి!
X
పశ్చిమబెంగాల్ లో భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకోవడం ఖాయం అని అంటోంది తాజా సర్వే. ఏబీపీ-నీల్సన్ సర్వే బెంగాల్ ఎంపీ సీట్ల విషయంలో ఆసక్తిదాయకమైన ఒపీనియన్ పోల్ ఫలితాలను ప్రకటించింది. వెస్ట్ బెంగాల్ లో మమతా దీదీకి తిరుగు లేదు అని ఈ సర్వే చెబుతోంది. గత లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తన సత్తాను చూపించింది.ఈ సారి కూడా అదే స్థాయి ఊపు ఉన్నా రెండు ఎంపీ సీట్లను టీఎంసీ కోల్పోవడం ఖాయమని ఈ సర్వే అంచనా వేసింది.

విశేషం ఏమిటంటే..బీజేపీ తన బలాన్ని చాలా వరకూ పెంచుకుంటోంది బెంగాల్ లో. గత లోక్ సభ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ లో బీజేపీకి దక్కిన ఎంపీ సీట్లు కేవలం రెండే. అయితే ఈ సారి మాత్రం ఏకంగా బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లను నెగ్గే అవకాశం ఉందట. ఇది గట్టి ప్రోగ్రెస్ అని చెప్పవచ్చు.ఐదేళ్ల మోడీ పాలన తర్వాత కూడా అక్కడ బీజేపీ బలం రెండు నుంచి ఎనిమిదికి పెరగడం అంటే మాటలు కాదు.

బెంగాల్ లో బీజేపీని కాలు పెట్టనీయకూడదని మమతా బెనర్జీ గట్టిగానే ప్రయత్నించారు. ఆ విషయంలో మమతా దీదీ అమిత్ షాతో గట్టిగానే ఢీ కొట్టింది. అయినా.. బీజేపీ అక్కడ తన ఉనికిని పెంచుకొంటున్నట్టుగా ఉంది. ఒక బెంగాల్ లో గతంలో ఒక వెలుగు వెలిగిన కమ్యూనిస్టుల కథ క్లైమాక్స్ కు వచ్చిందని ఈ సర్వే చెబుతోంది. ఈ సారి అక్కడ వామపక్షాలకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఈ సర్వే అంచనా వేస్తూ ఉండటం విశేషం.

ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరి పోరు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ సీట్లను నెగ్గే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. స్థూలంగా బెంగాల్ లో టీఎంసీ ముప్పై ఒక్క ఎంపీ సీట్లను, బీజేపీ ఎనిమిదింటిని, కాంగ్రెస్ మూడింటిని నెగ్గే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది.