Begin typing your search above and press return to search.

జాతీయ పార్టీ ఏర్పాటులో కేసీఆర్ తీసుకున్న కీల‌క జాగ్ర‌త్త‌లు ఇవే!

By:  Tupaki Desk   |   6 Oct 2022 6:34 AM GMT
జాతీయ పార్టీ ఏర్పాటులో కేసీఆర్ తీసుకున్న కీల‌క జాగ్ర‌త్త‌లు ఇవే!
X
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. బీఆర్ఎస్ (భార‌త రాష్ట్ర స‌మితి) పేరుతో జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించి గ‌ణ‌నీయ‌మైన ఫ‌లితాలు సాధించాల‌నే కృత నిశ్చ‌యంతో కేసీఆర్ ఉన్నారు. త‌ద్వారా బీజేపీకి గ‌ట్టి షాక్ ఇవ్వాల‌నే త‌ల‌పోస్తున్నారు.

కాగా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ఏర్పాటు చేసే క్ర‌మంలో కేసీఆర్ అనేక కీల‌క జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎక్క‌డా న్యాయ‌ప‌ర‌మైన వివాదాలు త‌లెత్త‌కుండా... కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీ) ఎలాంటి అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌కుండా న్యాయ‌నిపుణుల‌తో చ‌ర్చించి ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని అంటున్నారు.

ముందు టీఆర్ఎస్‌తోపాటుగా బీఆర్ఎస్ ను ఏర్పాటు చేయాల‌ని కేసీఆర్ భావించారు. అయితే రెండు పార్టీల‌వుతాయ‌ని.. పార్టీ శ్రేణులు, ఇత‌ర రాష్ట్రాల్లో చేరే నేత‌లు ఇలా రెండు పార్టీల‌తో అయోమ‌యానికి గుర‌వుతార‌ని చివ‌ర‌కు టీఆర్ఎస్ నే బీఆర్ఎస్ గా మార్చాల‌ని నిర్ణ‌యించారు. అదేవిధంగా టీఆర్ఎస్.. జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార‌డంతో కొత్త జెండా, కొత్త పార్టీ గుర్తుకు ద‌ర‌ఖాస్తు చేయాల‌ని భావించారు. అయితే కొత్త జెండా, కొత్త పార్టీ గుర్తు కొంత సంక్లిష్ట‌త‌తో కూడుకున్న వ్య‌వ‌హారం కావ‌డం, ఇందుకు సుదీర్ఘ‌మైన ప్ర‌క్రియ‌ను అనుస‌రించాల్సి రావ‌డం, కొత్త పార్టీ గుర్తు రావ‌డానికి స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉండ‌టంతో కొత్త పార్టీ జెండా, కొత్త పార్టీ గుర్తుకు ద‌ర‌ఖాస్తును విర‌మించుకున్నార‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీకి ఉన్న గులాబీ జెండా, పార్టీ గుర్తు.. కారుతోనే బీఆర్ఎస్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అయితే టీఆర్ఎస్ జెండాలో తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గా జాతీయ పార్టీ అయిన నేప‌థ్యంలో జెండాలో తెలంగాణ ఒక్క‌టే ఉండటం కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతానికి ఆ జెండాతోనే ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించారు.

అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు.. బీఆర్ఎస్ గుర్తుగా ఉంటుంది. ఇక నుంచి బీఆర్ఎస్ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు కారు గుర్తుతోనే పోటీ చేస్తార‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి టీఆర్ఎస్ పార్టీ లేఖ రాసింది. టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చామ‌ని.. బీఆర్ఎస్ గా టీఆర్ఎస్ ను గుర్తించాల‌ని విన్న‌వించింది.

టీఆర్ఎస్ పేరు మార్పును గుర్తించి జాతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వాల్సిందిగా మాత్రమే ప్రస్తుతానికి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించిన వెంటనే తక్షణం పార్టీ రాజ్యాంగంలో మార్పు చేయాల‌ని కేసీఆర్ యోచిస్తున్నారు. ఆ త‌ర్వాత‌ పార్టీ జెండాను మారుస్తార‌ని తెలుస్తోంది. కాగా కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ పార్టీని గుర్తించ‌డానికి రెండు మూడు రోజుల వ్యవధి పడుతుందని స‌మాచారం.

ప్ర‌స్తుతం మునుగోడులో సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఉప ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఒక‌టి రెండు రోజుల్లో ఇచ్చే అవ‌కాశం ఉంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి కొత్త పార్టీకి అనుమ‌తులు వ‌స్తే మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీ చేసే అభ్య‌ర్థి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తారు. ఒక వేళ కేంద్ర ఎన్నిక‌ల సంఘం బీఆర్ఎస్ ను గుర్తించ‌డంలో ఆల‌స్యం జ‌రిగితే టీఆర్ఎస్ త‌ర‌ఫున అభ్య‌ర్థి బ‌రిలో ఉంటారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.