Begin typing your search above and press return to search.

వరంగల్ ఉప ఎన్నికల్లో విజేత ఎవరు..?

By:  Tupaki Desk   |   22 Nov 2015 4:14 AM GMT
వరంగల్ ఉప ఎన్నికల్లో విజేత ఎవరు..?
X
వరంగల్ లోక్ సభా స్థానానికి పోలింగ్ ముగిసింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ నెల 24న అంటే.. మరో రెండురోజుల్లో ఫలితం బయటకు రానుంది. తాజాగా పోలింగ్ ముగిసిన నేపథ్యంలో.. ఓటింగ్ సరళిని అనుసరించి విజయవకాశాలు ఎలా ఉన్నాయనే అంశం మీద చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ చర్చల్లో వివిధ రాజకీయ పార్టీ నేతలు ఒకేలాంటి అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం. వరంగల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన కాసేపటికి.. ఓటింగ్ సరళిపై వివిధ రాజకీయ పార్టీలు విశ్లేషించటం మొదలు పెట్టాయి.

2014 సార్వత్రి ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్ సభా నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువగా టీఆర్ ఎస్ కు అందించిన వరంగల్ ఓటర్లు.. ఈసారి అధికారపక్షం పట్ల తమకున్న అభిమానాన్ని ప్రదర్శించారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని అధికారపార్టీ నేతలతో పాటు.. విపక్ష నేతలు సైతం లోగుట్టుగా అంగీకరిస్తున్నారు. నిజానికి ఉప ఎన్నిక మొదలైన నాటి నుంచి ఈ ఎన్నికల్లో విజయం మీద అధికారపక్షం ధీమా ఉంది. గెలుపు తమదేనని తేల్చి చెబుతోంది.

దీనికి తగ్గట్లే.. వరంగల్ విజయం.. టీఆర్ ఎస్ నే వరిస్తుందని చెబుతున్నారు. మిగిలిన పార్టీల్లో ప్రభావం చూపించే అభ్యర్థులు బరిలో లేకపోవటం.. తెలంగాణ అధికార పక్షాన్ని నిలువరించే శక్తి మిగిలిన పార్టీ అధినేతల్లో పెద్దగా లేకపోవటంతో పెద్ద ఇబ్బందిగా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో మాదిరి బంపర్ మెజార్టీ రాకున్నా.. లక్ష నుంచి 1.5లక్షల వరకూ మెజార్టీతో టీఆర్ ఎస్ అభ్యర్థికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పాలకుర్తి.. వర్థన్నపేట.. పరకాలలో టీఆర్ఎస్ ఇబ్బందికర పరిస్థితి ఉండొచ్చని అంటున్నారు. మొత్తం ఏడు నియోజవర్గాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ తగ్గుతుంద. అంచనా వేస్తున్నారు.

మొదట్లో కాస్తంత తడబడినప్పటికీ ఉప ఎన్నికల ప్రచారం పూర్తి అయ్యే నాటికి కాంగ్రెస్ పుంజుకుందున్న వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ తన అభ్యర్థిగా రాజయ్యను ఎంపిక చేయటం.. ఆయన కోడలు.. ముగ్గురు మనమలు అనుమానాస్పద రీతిలో మరణించటంతో.. ఆయన అభ్యర్థిత్వం నుంచి తొలగించి.. సర్వే సత్యానారాయణను ఎంపిక చేశారు. దీంతో..కొద్దిపాటి ఇబ్బందిని ఎదుర్కొన్నప్పటికీ.. పోలింగ్ సమయానికి పార్టీ పుంజుకుంది. అయితే.. అధికార టీఆర్ ఎస్ కు చెక్ పెట్టే స్థాయిలో కాంగ్రెస్ బలపడలేదన్న మాట వినిపిస్తోంది.

వరంగల్ ఉప ఎన్నికలో విజేతగా టీఆర్ ఎస్ విజయం తధ్యమని.. కాకుంటే మెజార్టీ విషయంలో ఆ పార్టీ ఆశలు వమ్ము కావొచ్చని చెబుతున్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తుందని.. మూడోస్థానంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి.. నాలుగో స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలవొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఈ అంచనాల్లో నిజం ఎంతన్నది 24 మధ్యాహ్నం వరకూ వెయిట్ చేస్తే తెలిసిపోవటం ఖాయం.