Begin typing your search above and press return to search.

బ్రిట‌న్ పార్ల‌మెంటుకు తొలి సిక్కు మ‌హిళ‌

By:  Tupaki Desk   |   9 Jun 2017 11:18 AM GMT
బ్రిట‌న్ పార్ల‌మెంటుకు తొలి సిక్కు మ‌హిళ‌
X
బ్రిటన్‌ ఎన్నికల్లో ఓ భార‌తీయ మ‌హిళ విజయం సాధించారు. బ్రిటన్‌ పార్లమెంటుకు ఎన్నికైన తొలి సిక్కు మహిళగా చ‌రిత్ర‌ సృష్టించారు. ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి చెందిన ప్రీత్‌ కౌర్‌ గ్రిల్‌ బర్మింగ్‌ హామ్‌ ఎడ్జ్‌ బాస్టన్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మొత్తం 24,124 ఓట్లు సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు. త‌న ప్ర‌త్యర్థి అయిన‌ కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థి కరోలిన్‌ స్క్వైర్‌పై గ్రిల్‌ 6,917 ఓట్ల తేడాతో గెలుపొందారు. గ్రిల్ ప్రస్తుతం సండ్వెల్లి కౌన్సిలర్‌ గా ప‌ని చేస్తున్నారు.

ఎంపీగా త‌న‌ను ఎన్నుకున్నందుకు ఎడ్జ్‌ బాస్టన్‌ ప్రజలకు గ్రిల్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌జాసేవ చేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు. బ్రిటన్ పార్లమెంటులో తొలిసారి అడుపెడుతున్న సిక్కు తానే కావ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. తనకు చాలా ఆనందంగా ఉందని గ్రిల్‌ చెప్పారు.

అదే పార్టీకి చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్‌ మన్‌ జీత్‌ సింగ్‌ దేశి కూడా కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థిపై 16,998 ఓట్ల తేడాతో గెలుపొందారు. స్లోగ్‌ నుంచి తన్‌ మన్‌ జీత్‌ పోటీ చేసి 34,170 ఓట్లు సాధించారు. సిక్కులకు అవకాశం ఇచ్చినందుకు లేబర్‌ పార్టీకి త‌న్‌ మ‌న్‌ జీత్‌ ధన్యవాదాలు తెలియజేశారు.

కాగా, ఈ పార్టీ నుంచి పోటీ చేసిన మరో సిక్కు అభ్యర్థి కుల్దీప్‌ సహోతా ప్రత్యర్థి చేతిలో 720 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బ్రిటన్‌ పార్లమెంట్‌ కు ఇద్దరు సిక్కు అభ్యర్థులు గెలుపొందడం ఇదే ప్ర‌థ‌మం. ఈ సారి జ‌రిగిన‌ బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 56మంది భారత సంతతి వ్య‌క్తులు ఎన్నిక‌ల్లో పాల్లొన‌డం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/