Begin typing your search above and press return to search.

తుంగభద్ర నదిలో గర్భిణి గల్లంతు

By:  Tupaki Desk   |   26 July 2020 9:50 AM GMT
తుంగభద్ర నదిలో గర్భిణి గల్లంతు
X
బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న తెలుగు రాష్ట్రాల భార్యభర్తలిద్దరూ హైదరాబాద్ వస్తూ వాగులో గల్లంతయ్యారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా.. తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టు వద్ద హోం క్వారంటైన్ ముద్ర వేస్తారని అడ్డదారిలో రావడానికి ప్రయత్నించారు. అదే వారి పాలిట శాపమైంది.

నాగ సింధూరెడ్డి (28) తన భర్త శివశంకర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ లోని అత్తగారింటికి బయలు దేరింది. లాంగ్ డ్రైవ్ లో భాగంగా శివశంకర్ స్నేహితుడైన జిలానీ బాషాతో కలిసి పయనమయ్యారు. జాతీయ రహదారి మీదుగా తెలంగాణలోని పుల్లూరు చెక్ పోస్టు సమీపంలో కరోనా పరీక్షలు చేసి.. హోం క్వారంటైన్ విధిస్తారనే భయంతో జాతీయ రహదారి నుంచి కారును గ్రామాల మీదుగా మళ్లించారు. జోరు వర్షంలో వరదని అంచనా వేయలేక కారును చెక్ డ్యాం నుంచి పోనివ్వగా.. వాగు ఉధృతంగా ప్రవహించడంతో కారు అదుపుతప్పి వాగులో పల్టీ కొట్టింది.

భార్య సింధూ వాగులో కొట్టుకుపోగా.. ఆమెను కాపాడేందుకు శివశంకర్ రెడ్డి అతికష్టం మీద డోర్ తెరిచి ఆమెను బయటకు లాగే ప్రయత్నం చేశాడు. కానీ వరద ఉధృతి కారణంగా సింధూ వాగులో కొట్టుకుపోయింది. శివశంకర్ రెడ్డి, ఆయన స్నేహితుడు జిలానీ గాయాలతో ఒడ్డుకు చేరుకున్నారు. సింధూ వాగు ద్వారా నేరుగా 500మీటర్ల దూరంలోనే తుంగభద్ర నదిలో కలుస్తుంది. దీంతో ఆమె సురక్షితంగా బయటపడుతుందో లేదోననే అనుమానాలు కలుగుతున్నాయి. అధికారులు సిందూ ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. సింధూ తుంగభద్ర నదిలో కొట్టుకుపోయిందేమోనని అధికారులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.