Begin typing your search above and press return to search.

సమ్మెకు సిద్ధం.. ఉద్యోగుల క‌ట్ట‌డిపై స‌ర్కారు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌!

By:  Tupaki Desk   |   4 Feb 2022 7:30 AM GMT
సమ్మెకు సిద్ధం.. ఉద్యోగుల క‌ట్ట‌డిపై స‌ర్కారు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌!
X
ఏపీ స‌ర్కారుకు, ఉద్యోగుల‌కు మ‌ధ్య త‌లెత్తిన వివాదం.. తీవ్ర రూపం దాల్చిన విష‌యం తెలిసిందే. కొత్త‌గా ప్ర‌క‌టించిన పీఆర్సీతో త‌మ‌కు న‌ష్ట‌మేన‌ని వాదిస్తున్న ఉద్యోగులు ఒక‌వైపు.. ఇంత‌కు మించి చేయ‌లే మ‌ని.. ఇప్ప‌టికే చాలా చేశామ‌ని.. చెబుతున్న ప్ర‌భుత్వం మ‌రోవైపు.

ఇరు ప‌క్షాలు గ‌ట్టిగానే త‌మ వాయిస్ వినిపిస్తున్నాయి. ఈక్ర‌మంలోనే ఈ నెల 7 నుంచి సంపూర్ణ స‌మ్మెకు ఉద్యోగులు రెడీ అయ్యారు. దీనికి స‌న్నాహ‌కంగా.. గురువారం చ‌లో విజ‌య‌వాడ‌ నిర్వ‌హించారు. అయితే.. దీనిని అడ్డుకునేందుకు.. ప్ర‌బుత్వం అన్ని విధాలా ప్ర‌య‌త్నించింది.

ఎక్క‌డిక‌క్క‌డ ఉద్యోగుల‌ను అరెస్టు చేయించారు. అంతేకాదు.. బ‌స్సులు, కార్లు, రైళ్ల‌నుకూడా జల్లెడ ప‌ట్టి మ‌రీ ఉద్యోగుల‌ను విజ‌య‌వాడ‌కు వెళ్ల‌కుండా అడ్డుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఉద్యోగులు మాత్రం విజ‌య‌వాడ చేరుకుని.. భారీ ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇది అంత చిన్న విష‌యం కాద‌నే విష‌యం ప్ర‌బుత్వానికి అర్ధ‌మైంది. అయిన‌ప్ప‌టికీ.. వారి డిమాండ్ల‌ను నెర‌వేర్చే ప‌రిస్థితి లేద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అవ‌స‌ర‌మైతే.. ఎన్నిసార్ల‌యినా.. చ‌ర్చించేందుకు తాము సిద్ధ‌మ‌న‌ని స‌ర్కారు నుంచి ఉద్యోగుల‌కు సందేశాలు వ‌స్తున్నాయి.

అయితే.. తాము ఏం చ‌ర్చించినా.. త‌మ పీఆర్సీ పెర‌గాల్సిందేన‌ని.. సీపీఎస్‌ను ర‌ద్దు చేయాల్సిందేన‌ని.. ఉద్యోగులు ప‌ట్టుబ‌డుతున్నారు. ప్ర‌భుత్వం వైపు నుంచి చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నా.. హెచ్చార్ ఏ పెంపు స‌హా సీపీఎస్ ర‌ద్దు అంశాల‌పై మాత్రం ప్ర‌భుత్వం కూడా ప‌ట్టుద‌ల‌తోనే ఉంది. దీంతో ఉద్యోగుల‌కు స‌మ్మెకు రెడీ అవుతున్నారు. ఇదే జ‌రిగితే... ప్ర‌బుత్వ వ్య‌వ‌స్థ దాదాపు స్తంభించి పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు... న్యాయ‌, ఆర్టీసీ, వైద్య ఉద్యోగులు కూడా వీరికి సంఘీభావం చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌బుత్వానికి ఇప్పుడు ఈ స‌మ్మె సెగ నుంచి ఎలా బ‌య‌ట‌పడాల‌నే అంశం.. ప్ర‌ధానంగా మారింది. ఒక‌వైపు చ‌లో విజ‌య‌వాడ సక్సెస్ కావ‌డం.. మ‌రోవైపు.. స‌మ్మెకు రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు రెడీ కావ‌డం వంటివి.. స‌ర్కారుకు ఇబ్బందిలోకి నెట్టింద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో ఏం చేయాలి? ఉన్న ఒకే ఒక్క ప‌రిష్కారం ఎస్మా ప్ర‌యోగించ‌డం! అయితే.. ఇంత తీవ్ర‌మైన నిర్ణ‌యానికి ప్ర‌భుత్వం దిగుతుందా? అనేది స‌మ‌స్య‌. అయినప్ప‌టికీ.. త‌మ కు ఇబ్బంది లేద‌ని.. ఉద్యోగులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.