Begin typing your search above and press return to search.

మళ్లీ సకల జనుల సమ్మె సీన్‌

By:  Tupaki Desk   |   16 March 2020 7:30 PM GMT
మళ్లీ సకల జనుల సమ్మె సీన్‌
X
అప్పుడెప్పుడో కేసీఆర్‌ సకల జనుల సమ్మెకు పిలుపునిస్తే కనిపించిన దృశ్యం... ఉగాది, సంక్రాంతి సమయాల్లో మాత్రమే చూడగలిగిన సీన్‌... ఇప్పుడు హైదరాబాద్‌ లో కనిపిస్తోంది. అదేంటంటే... ట్రాఫిక్‌ లేని ఖాళీ రోడ్లు. కరోనా దెబ్బకు హైదరాబాద్‌ బిగుసుకుపోయింది. ఆ మహానగరంలో ఒక్కొక్కటిగా బయటకొస్తున్న కేసులతో హైదరాబాదీలు వణికిపోతున్నారు. ఇళ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఆ ఎఫెక్టే రోడ్లపై పడింది. రోజూ రయ్యిమని దూసుకెళ్లే లక్షలాది బండ్లు లేక రోడ్లు మౌనం దాల్చాయి. వైరస్‌ నివారణ చర్యలపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కూడా బాగా పనిచేసింది. గుంపులుగా తిరగడానికి, సమూహాల్లోకి వెళ్లడానికి జనం జంకుతున్నారు. సినిమాహాళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. షాపింగ్‌ మాళ్లు, హోటళ్లు - పార్కులు - పబ్బులదీ అదే దారి. బయటికెళ్లినా కాలక్షేపం లేక, జనం ఇంటి గడప దాటడం లేదు.

మామూలుగానైతే, ఆదివారం నాడు హైదరాబాద్‌ లో సందడే వేరు. బడుగు వర్గాల నుంచి బడా వర్గాల వరకు రిలీఫ్‌ కోసం బయటికొస్తారు. షాపింగులు - సినిమాలు - షికార్లతో సందడిగా కనిపిస్తారు. ఈ ఆదివారం మాత్రం ఆ సీన్‌ రివర్సయింది. హైదరాబాద్‌ మెయిన్‌ ఏరియాల్లోని సినిమా హాళ్లు - మాల్స్‌ - హోటళ్లు చాలావరకు మూతపడ్డాయి. తెరిచివున్న వాటిలోకి వెళ్లడానికీ ప్రజల్లో పెద్దగా ఇంట్రస్ట్‌ కనిపించలేదు. దీంతో నీరసంతో అవికూడా నీరుగారిపోయాయి. ముఖ్యంగా ఐమాక్స్ - లుంబినీ పార్కు - ఎన్టీఆర్‌ గార్డెన్‌ - జలవిహార్‌ మూసివేయడంతో నెక్లెస్‌ రోడ్డు నిర్మానుష్యంగా మారింది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులివ్వడం కూడా జన సంచారంపై ఎఫెక్స్‌ చూపింది. మొత్తంగా హైదరాబాద్‌ లో కర్ఫ్యూ పెడితే ఎలా ఉంటుందో - ఆదివారం అచ్చంగా అలాగే కనిపించింది.