Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల రాజీనామాలు ఆమోదించేశారు

By:  Tupaki Desk   |   9 March 2018 11:08 AM GMT
త‌మ్ముళ్ల రాజీనామాలు ఆమోదించేశారు
X
జ‌రుగుతున్న దానికి.. దాన్ని మీడియాలో చూపిస్తున్న దానికి సంబంధం లేన‌ట్లుగా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకిలా అంటే..గ‌డిచిన మూడు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలే నిద‌ర్శ‌నంగా చెప్పాలి. పేప‌ర్లో రాస్తున్న దానికి.. వాస్త‌వంగా జ‌రుగుతున్న దానికి సంబంధం లేన‌ట్లుగా కొన్ని ప‌రిణామాలు ఉన్నాయి.

అవేంటో చూస్తే.

1. ఏపీకి హోదా ఇవ్వ‌టం త‌ర్వాత‌.. అవ‌స‌ర‌మైన నిధుల కేటాయింపులు.. అత్య‌వ‌స‌ర‌మైన హామీల అమ‌ల్లోనూ హ్యాండిచ్చిన వైనం ఏపీ ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంద‌ని.. ఆంధ్రోళ్లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారంటూ త‌మ కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయిస్తున్న‌ట్లుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీన్నో భారీ ప‌రిణామంగా తెలుగు మీడియాకు చెందిన ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు అభివ‌ర్ణించాయి. కానీ.. బాబు కేవ‌లం త‌న మంత్రుల్ని మాత్ర‌మే ఉప‌సంహ‌రించుకున్నారే త‌ప్పించి.. ఎన్డీయే కూట‌మి నుంచి బ‌య‌ట‌కు రాలేదు. కూట‌మిలో ఉంటూ ప‌ద‌వుల్లో లేని కార‌ణంగా ఏపీ ప్ర‌జ‌ల‌కు ఒరిగేదేమిటి?

2. ప్ర‌జ‌ల కోసం ప‌ద‌వుల్ని త్యాగం చేసుకున్నార‌న్న సానుకూలత సొంతం చేసుకోవ‌ట‌మే త‌ప్పించి.. నిజంగా మోడీతో బాబు క‌టీఫ్ అన్నారా? అంటే అన‌లేద‌నే చెప్పాలి.

3. ఫోన్ సంభాష‌ణ‌ను బ‌య‌ట‌పెట్టిన దానిలోనూ బాబు ఇమేజ్ పెంచేలా విష‌యాలు ఉండ‌టం.. మోడీతో త‌మ సంబంధాలు కోల్పోవ‌టానికి తాను సిద్ధంగా లేన‌న్న స‌మాచారం ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. అంటే.. ప్ర‌జ‌ల కంటితుడుపు కోసం రాజీనామా డ్రామాను బాబు ఆడిన‌ట్లుగా చెప్పాలి.

4. బాబు ఫోన్ చేస్తే ప్ర‌ధాని అందుబాటులో రాలేద‌ని మీడియాలో వ‌చ్చింది. అంటే.. బాబు ఎందుకు మాట్లాడాల‌నుకున్నార‌న్న‌ది మోడీకి తెలియ‌ద‌న్న మాటేగా. ఛాన‌ల్స్ ను ఫాలో అవుతుంటే.. విష‌యం అర్థ‌మ‌వుతుంటుంద‌నుకుందాం. బాబుతో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌కుండానే.. తెల్లారి తెల్లారేస‌రికి ఏపీ స‌ర్కారులో భాగ‌స్వామ్య‌మైన బీజేపీ మంత్రులు త‌మ ప‌దవుల‌కు రాజీనామా చేయ‌టం.. అది కూడా కేంద్ర‌మంత్రుల కంటే కొన్ని గంట‌ల ముందే కావ‌టం మ‌ర్చిపోకూడ‌దు.

5. స‌యోధ్య కోసం.. తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యం తీసుకోవ‌ద్దంటూ మోడీ ఆర్థించిన‌ట్లుగా బాబుతో మోడీ ఫోన్ కాల్ సారాంశంగా మీడియాలో వ‌చ్చింది. అదే నిజ‌మైతే.. త‌మ నేత‌ల మంత్రి ప‌ద‌వుల‌కు మోడీ ఎందుకు రాజీనామా చేయిస్తారు? పార్టీ సైతం ఆ దిశ‌గా ఎందుకు నిర్ణ‌యం తీసుకుంటుంది?

6. ఏపీకి చెందిన కేంద్రమంత్రులు త‌మ రాజీనామా లేఖ‌ల్ని ప్ర‌ధానికి ఇవ్వ‌టానికి రెండు గంట‌ల ముందు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. అప్ప‌టికే త‌మ పార్టీకి చెందిన మంత్రులు ఏపీ ప్ర‌భుత్వంలో తాము నిర్వ‌ర్తిస్తున్న ప‌ద‌వుల్ని వ‌దిలేశారు. మోడీ ఫోన్ కాల్ బాబును శాంతించ‌మ‌ని చెప్పేందుకే అయితే.. బీజేపీ మంత్రులు త‌మ ప‌దువుల‌కు రాజీనామా చేయ‌రు క‌దా?

7. ఏపీ కేంద్ర‌మంత్రుల రాజీనామాల్ని ప్ర‌ధాని మోడీ చేతికి ఇచ్చిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే.. రాజీనామా లేఖ‌ల్ని ఆమోదించిన‌ట్లుగా ప్ర‌క‌ట‌లు వ‌చ్చేశాయి. అదే స‌మ‌యంలో ఏపీ బీజేపీ నేత‌లు త‌మ రాజీనామాల్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేతికి ఇచ్చినా.. ఇప్ప‌టికీ వాటికి ఆమోద ముద్ర ప‌డ‌లేదు ఎందుకు? మోడీ స్పీడ్ తో పోలిస్తే.. మాంచి కాక మీద ఉన్నార‌ని చెప్పే చంద్ర‌బాబు..మోడీ కంటే ముందే చంద్ర‌బాబు రాజీనామాల్ని ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలి క‌దా? అలాంటిదేమీ ఎందుకు చేయ‌న‌ట్లు?

8. ఈ అంశాల‌న్నీ చూసిన‌ప్పుడు హోదా కోసం.. ఏపీ ప్ర‌జ‌ల కోసం తాము ఎంత‌టి త్యాగానికైనా సిద్ధ‌మ‌ని రంకెలేసే చంద్ర‌బాబు.. అదంతా మీడియాలో హ‌డావుడి కోస‌మే త‌ప్పించి.. మ‌రింకేమీ కాద‌న్న విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు.