Begin typing your search above and press return to search.

పాక్ అసలు బుద్ధి ఇదే..అధ్యక్షుడే బయటపెట్టాడు!

By:  Tupaki Desk   |   14 Aug 2019 9:24 AM GMT
పాక్ అసలు బుద్ధి ఇదే..అధ్యక్షుడే బయటపెట్టాడు!
X
అంతర్జాతీయ సమాజం ఎంతగా ఛీకొట్టినా - అంతర్జాతీయ వేదికల మీద ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినా... భారత్ పట్ల పాకిస్థాన్ వైఖరి మారట్లేదు. జరిగిన - జరుగుతున్న - జరగబోయే ఘోరాలకు తానే కారణమని తెలిసినా - తెలిసీ తెలియనట్లు నటించినా.. అంతర్జాతీయ సమాజం తప్పులను ఎత్తిచూపినా... ఉగ్రవాదంపై పాక్ బుద్ధి మారడం లేదు. ఉగ్రవాదానికి కేంద్రంగా పాక్ మారుతోందని భారత్ ఎన్ని ఆధారాలు చూపెట్టినా... అవన్నీ ఫేకేనని బుకాయించే పాక్ ఇప్పుడు నిజంగానే తన అసలు రంగును బయటపెట్టుకోవడంతో పాటుగా భారత్ పట్ల తన వైఖరి ఏమిటో నిస్సిగ్గుగానే చెప్పేసింది. ఎందుకంటే... ఆ దేశం అనుసరిస్తున్న వ్యూహాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడే ఇప్పుడు బయటపెట్టేశారు. భారత్ పై పాక్ పైచేయి సాధించాలంటే... జిహాద్ ఒక్కటే మార్గమని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనాలనే రేపుతున్నాయి.

పాక్ అధ్యక్షుడిగా బాధ్యతాయుత పదవిలో ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటే నిజంగా సంచలనమే కదా. సరే... అలీ ఏ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వ్యాఖ్యలు చేశారన్న విషయానికి వస్తే..బుధవారం పాకిస్థాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణను భారత్‌ పార్లమెంటు రద్దు చేసిన విషయం తెలిసిందే. పైగా రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ చట్టం చేశారు. ఇది జరిగినప్పటి నుంచి భారత్‌ పై అక్కసుతో రగిలిపోతున్న పాకిస్థాన్‌ ఈ అంశాన్ని అంతర్జాతీయ వివాదంగా మార్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అగ్ర దేశాలైన అమెరికా - రష్యాలతో పాటు చివరికి తన మిత్ర దేశం చైనా కూడా పాకిస్థాన్‌ కు బాసటగా నిలవక పోవడంతో దాయాదీ దేశం దిక్కుతోచని స్థితిలో పడింది.

ఈ స్థితిలో మరింత బాధ్యతాయుతంగా ఉండి ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకోసం ప్రయత్నించాల్సిన ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ తానే స్వయంగా జిహాద్ కి పిలుపునివ్వడంపై పలువురు మండిపడుతున్నారు. భారత్ పై అక్కసుతో ద్వైపాక్షిక సంబంధాలను తెంచుకోవడంతో మన దేశం నుంచి దిగుమతులు నిలిచిపోయి పాకిస్థాన్‌ లో వస్తువుల ధరలు ఆకాశయానం చేస్తున్నాయి. బక్రీద్‌ పవిత్ర దినాన ధరలు మండిపోవడంతో పాకిస్థాన్‌ ప్రజలు కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరిఫ్‌ అల్వీ వ్యాఖ్యలు మరింత దుమారానికి కారణమయ్యాయి.