Begin typing your search above and press return to search.

ఏపీకి ప్ర‌త్యేక హోదా!..సాయిరెడ్డి సాధిస్తారా?

By:  Tupaki Desk   |   5 Feb 2018 12:22 PM GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా!..సాయిరెడ్డి సాధిస్తారా?
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న విష‌యంలో విప‌క్ష వైసీపీ ఏమాత్రం వెనుకంజ వేయడం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత... కొత్త రాష్ట్రం తెలంగాణ ధ‌నిక రాష్ట్రంగా ఏర్ప‌డితే... రాజ‌ధాని కూడా లేకుండా ఏర్ప‌డ్డ న‌వ్యాంధ్ర ఆర్థిక స‌మ‌స్యల‌ ఊబిలో కూరుకుపోయింది. అయితే నాడు ఏపీ ప్ర‌జ‌ల వాద‌న‌ను ఏమాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా తెలుగు నేల‌ను విడ‌గొట్టిన ప్ర‌జాందోళ‌న‌కు జ‌డిసి... ఏపీకి ప్ర‌త్యేక హోదా కేటాయిస్తామ‌ని, విశాఖ కేంద్రంగా ప్ర‌త్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామ‌ని, అంతేకాకుండా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన‌ని అంశాల్లోనూ ఏపీకి చేయూత‌గా నిలుస్తామ‌ని పార్ల‌మెంటు సాక్షిగా నాడు ప్ర‌ధాని హోదాలో మాజీ పీఎం మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌క‌టించారు. నాడు విప‌క్షంలో ఉన్న బీజేపీ... ప్ర‌త్యేక హోదాను ఐదేళ్ల పాటు కొన‌సాగిస్తామంటే... కాదు కాదు ప‌దిహేనేళ్ల పాటు కొన‌సాగించాల‌ని బీజేపీ ఎంపీ హోదాలో ప్రస్తుత భార‌త ఉప‌రాష్ట్రప‌తి హోదాలో ఉన్న వెంక‌య్య‌నాయుడు డిమాండ్ చేశారు.

మొత్తానికి నాడు ఏపీ ప్ర‌జ‌ల ఇష్టాఇష్టాల‌తో ప‌నిలేకుండా రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిపోయింది. అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో యూపీఏ స‌ర్కారు గ‌ద్దె దిగ‌గా.. న‌రేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ స‌ర్కారు పాల‌నా ప‌గ్గాల‌ను చేపట్టింది. ఏపీకి తామున్నామంటూ నాడు క‌ల‌రింగ్ ఇచ్చిన బీజేపీ నేత‌లు.. తాము అధికారంలోకి రాగానే... మాట మార్చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు వీలు కావ‌డం లేద‌ని... ప్ర‌త్యేక ప్యాకేజీ అయితే చూస్తామంటూ డ్రాగ్ చేసి ఆ ప్ర‌త్యేక ప్యాకేజీకి టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఒప్పుకునేలా పావులు క‌దిపింది. అప్ప‌టికే నానా ఇబ్బందుల్లో ఉన్న చంద్ర‌బాబు కూడా ఆ ప్ర‌తిపాద‌న‌కు స‌రేన‌న‌క త‌ప్ప‌లేద‌న్న వాద‌న నాడు వినిపించింది. అయితే ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీకి సంబంధించిన కేటాయింపులు కూడా ఇప్ప‌టిదాకా ఖ‌రారు కాలేద‌నే చెప్పాలి. అస‌లు రాష్ట్రానికి ప్ర‌త్యేక ప్యాకేజీ కాదు ప్ర‌త్యేక హోదానే కావాలంటూ మొద‌టి నుంచి విప‌క్ష వైసీపీ వాదిస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ - వామ‌ప‌క్షాల‌ మాట కూడా అదే. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించుకోవ‌డానికి వైసీపీ వివిధ రూపాల్లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసింది. ఆ పార్టీ అధినేత ఏకంగా యువ‌భేరీల పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హించారు.

అయితే కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న కేవీపీ రామ‌చంద్ర‌రావు... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాజ్య‌స‌భ‌లో ఏకంగా ప్రైవేట్ బిల్లు ప్ర‌వేశ‌పెట్టారు. ప‌లు నాట‌కీయ ప‌రిణామాల త‌ర్వాత ఆ బిల్లు రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చినా... ఇత‌ర ప‌క్షాలేవీ ఆ బిల్లుకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌ని నేప‌థ్యంలో అది వీగిపోయింది. తాజాగా మొన్నటి కేంద్ర బ‌డ్జెట్‌ లో ఏపీకి పంగ‌నామాలు పెట్టిన కేంద్రం తీరుపై వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - రాజ్య‌స‌భ‌లో ఆ పార్టీకి ఉన్న ఏకైక స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి ఇప్పుడు రంగంలోకి దిగిపోయారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ ఆయ‌న రాజ్య‌స‌భ‌లో ప్రైవేట్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టేందుకు సంక‌ల్పించారు. ఈ మేర‌కు ఆయ‌న పంపిన ప్రతిపాద‌న.. రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ వ‌ద్ద‌కు రాగా... ఇప్పుడు ఆ బిల్లుకు ఆమోదం ల‌భించింది. నేటి ఉద‌యం కోవింద్ స‌ద‌రు బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ‌కు రానుంది. గ‌తంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్‌ - టీడీపీ స‌భ్యులు కూడా ఆ బిల్లుకు మ‌ద్ద‌తుగా నిలిస్తే... ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌చ్చిన‌ట్లేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మ‌రి కేవీపీకి బిల్లుకు ఇవ్వ‌కున్నా... క‌నీసం సాయిరెడ్డి బిల్లుకైనా టీడీపీ ఎంపీలు మ‌ద్ద‌తు ఇస్తారో? లేదో? చూడాలి.