Begin typing your search above and press return to search.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ స్వీకారంలో జూలై 25 ప్ర‌త్యేక‌త ఇదేనా?

By:  Tupaki Desk   |   25 July 2022 3:48 AM GMT
రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ స్వీకారంలో జూలై 25 ప్ర‌త్యేక‌త ఇదేనా?
X
జూలై 25 సోమ‌వారం భార‌త 15వ‌ రాష్ట్ర‌ప‌తిగా ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. కాగా ప్ర‌మాణ స్వీకారంలో జూలై 25కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంది. మొద‌టి న‌లుగురు రాష్ట్ర‌పతులు మిన‌హాయించి 1977 నుంచి రాష్ట్ర‌ప‌తులుగా ఎన్నికైన‌వారంతా జూలై 25నే ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డం విశేషం. వాస్త‌వానికి జూలై 25నే ప్ర‌మాణ‌స్వీకారం చేయాల‌ని ఎలాంటి రాత‌పూర్వ‌క నియ‌మం, నిబంధ‌న ఏదీ లేదు. అయితే, 1977 నుంచి భార‌త రాష్ట్ర‌ప‌తులుగా ఎంపికైన‌వారంతా జూలై 25నే ప్ర‌మాణస్వీకారం చేయ‌డంతో అప్ప‌టి నుంచి జూలై 25 స్థిర‌ప‌డిపోయింది.

మొద‌టి భార‌త రాష్ట్ర‌ప‌తి బాబూ రాజేంద్ర ప్ర‌సాద్ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు.1952 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మళ్లీ 1957లోనూ రెండోసారి కూడా రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికయ్యారు. అనంతరం 1962లో అప్ప‌టికి ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న‌ సర్వేపల్లి రాధాకృష్ణన్ అదే ఏడాది మే 13న‌ రాష్ట్రపతి అయ్యారు. అయితే ఆ తర్వాత పదవి చేపట్టిన కొందరు పూర్తి కాలంపాటు కొనసాగలేకపోయారు. 1967 మే 13న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన డా.జాకీర్ హుస్సేన్‌ మే 3 1969లో మృతిచెందారు. వీవీ గిరి తర్వాత ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ సైతం మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల కార‌ణంగా పదవీకాలాన్ని పూర్తిచేయలేకపోయారు.

దేశ ఆరో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1977 జులై 25న ఆ పదవిని అలంకరించారు. అనంతరం ఆ బాధ్యతలు చేపట్టిన జ్ఞాని జైల్‌సింగ్‌ నుంచి.. ప్ర‌స్తుతం ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ వరకు అందరూ జూలై 25 తేదీనే రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. గ‌త 45 ఏళ్ల నుంచి జూలై 25నే భార‌త రాష్ట్ర‌ప‌తుల ప్ర‌మాణ‌స్వీకారం జరుగుతుండ‌టం విశేషం.

నీలం సంజీవ‌రెడ్డి నుంచి భార‌త రాష్ట్ర‌ప‌తులు అయిన‌వారంతా విజయవంతంగా తమ ఐదేళ్ల‌ పదవీ కాలాన్ని ముగించారు. జూలై 25న బాధ్యతలు స్వీకరించడం.. ఐదేళ్ల తర్వాత జూలై 24న పదవీ విమరణ చేయడం ఆనవాయితీగా మారింది

భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము జులై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌ భవనం సెంట్రల్‌ హాలులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు.

ఇప్పటివరకు తొమ్మిది మంది రాష్ట్రపతులు జూలై 25న తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము సైతం ఇదే తేదీన బాధ్యతలు చేపట్టి ఈ జాబితాలో చేరే 10వ వ్యక్తిగా నిలవనున్నారు.