Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రప‌తి పోలింగ్ ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   8 Jun 2017 4:45 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రప‌తి పోలింగ్ ఎక్క‌డ‌?
X
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత వస్తున్న తొలి రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈనెల‌లో ఇందుకు సంబంధించిన నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేయ‌నున్నారు. ఎన్నిక‌ల‌కు సంబంధించిన కీల‌క‌మైన ఓట్ల లెక్కింపు జులై 20న జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుత‌ రాష్ట్రప‌తి ప‌ద‌వీకాలం వ‌చ్చే నెల 24న ముగియ‌నుంది. ఆలోపు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేసి.. కొత్త రాష్ట్రప‌తి లాంఛ‌నంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు రంగం సిద్ధం చేసేందుకు వీలుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్‌ ను ప్ర‌క‌టించింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ జ‌ర‌గ‌నుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. విభ‌జ‌న త‌ర్వాత వ‌స్తున్న తొలి రాష్ట్రప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించిన‌ట్లు చెబుతున్నారు.

ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోని వెల‌గ‌పూడికి త‌ర‌లించిన నేప‌థ్యంలో ఈసారి ఎన్నిక‌ల్ని ఏపీలోనే పోలింగ్ స్టేష‌న్ ను ఏర్పాటు చేస్తార‌ని చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ భ‌వ‌నంలోని క‌మిటీహాట్ 201లో పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన‌ట్లుగా స‌మాచారం.

ఇక‌.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్ కేంద్రాన్ని అసెంబ్లీలోని క‌మిటీ హాల్ నెంబ‌రు వ‌న్ లో ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ ఎన్నిక కోసం అసిస్టెంట్ రిట‌ర్నింగ్ అధికారులుగా అసెంబ్లీ కార్య‌ద‌ర్శి రాజా స‌దారాం.. సంయుక్త కార్య‌ద‌ర్శి వి. న‌ర‌సింహాచార్యులు పోలింగ్‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్నారు.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌టానికి ఎన్నిక‌ల సంఘం ఓట‌ర్ల‌కు ప్ర‌త్యేక పెన్ ఇవ్వ‌నుంది. దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన పెన్నును మాత్ర‌మే వాడాల్సి ఉంది. రాష్ట్రప‌తి ఎన్నిక బ్యాలెట్ పేప‌ర్ల‌తోనే జ‌ర‌గ‌నుంది. అధికారులు ఇచ్చే బ్యాలెట్ పేప‌ర్ మీద‌.. ఎన్నిక‌ల సంఘం ఇచ్చే పెన్నుతోనే ఓట‌ర్లు మార్కింగ్ చేయాల్సి ఉంది. ఒక‌వేళ‌.. వేరే పెన్నుతో మార్కింగ్ చేస్తే ఆ ఓటు చెల్ల‌ద‌ని ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో రాజ్య‌స‌భ.. లోక్ స‌భ ఎంపీలు.. రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఓటేసే హ‌క్కు ఉంద‌ని. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల‌కు.. అసెంబ్లీకి నామినేట్ అయిన స‌భ్యుల‌కు ఓటు వేసే హ‌క్కు ఉండ‌దు. ఎమ్మెల్సీల‌కు సైతం ఓటు వేసే హ‌క్కు ఉండ‌దు.

ఈసారి రాష్ట్రప‌తి ఎన్నిల‌కు సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర అంశం ఉంద‌ని చెప్పాలి. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారి న‌సీం జైదీ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొత్తాన్ని ఆయ‌న నిర్వ‌హించ‌టం లేదు. ఎందుకంటే.. ఆయ‌న ప‌ద‌వీకాలం జులై 7న పూర్తి కానుంది. దీంతో.. ఆయ‌న స్థానంలో వ‌చ్చే వ్య‌క్తి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తారు. అంటే.. ఈసారి రాష్ట్రప‌తి ఎన్నిక‌ను ప్రారంభించేది ఒక అధికారి అయితే.. పూర్తి చేసేది మ‌రొక‌రు కావ‌టం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/