Begin typing your search above and press return to search.

తప్పంతా వాళ్లదే అంటున్న రాష్ట్రపతి భవన్

By:  Tupaki Desk   |   6 May 2018 6:37 AM GMT
తప్పంతా వాళ్లదే అంటున్న రాష్ట్రపతి భవన్
X
ఎన్నడూ లేని విధంగా రాష్ట్రపతి ఒక విచిత్ర కారణంతో ఇటీవల వివాదంలో నిలిచారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎక్కువ సేపు ఉండరని.. కాసేపే అక్కడ ఉండి మొత్తం 70 జాతీయ అవార్డుల్లో 11 మాత్రమే తన చేతుల మీదుగా ప్రదానం చేస్తారని ఈ వేడుకకు ముందు రోజు ప్రకటించడం వివాదాస్పదమైంది. దీంతో కొందరు జాతీయ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించడానికి కూడా సిద్ధపడ్డారు. ఇలా జాతీయ అవార్డుల వేడుక ఎన్నడూ వివాదాస్పదమైంది లేదు. ఈ విషయంలో రాష్ట్రపతికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఐతే రాష్ట్రపతిపై ఇంతటి విమర్శలు రావడానికి సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీనే కారణమంటూ రాష్ట్రపతి భవన్ ఆరోపిస్తుండటం గమనార్హం.

రాష్ట్రపతి జాతీయ అవార్డుల కార్యక్రమానికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరనే విషయం సమాచార ప్రసార శాఖకు చాలా ముందుగానే తెలియజేశామని.. కానీ సరిగ్గా ఈ వేడుకకు ఒక్క రోజు ముందు మాత్రమే మంత్రిత్వ శాఖ ఈ విషయంపై అవార్డు విజేతలకు.. మీడియాకు సమాచారం ఇచ్చి దీనిపై వివాదం రాజేసిందని రాష్ట్రపతి భవన్ ఆరోపించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి రాష్ట్రపతి భవన్ తరఫున లేఖ కూడా రాసినట్లు సమాచారం. ఐతే దీనిపై అటు ప్రధాన మంత్రి కార్యాలయం కానీ.. మంత్రిత్వ శాఖ కానీ ఏం మాట్లాడలేదు. మౌనం వహిస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే రాష్ట్రపతి వెళ్లిపోయాక స్మృతి లీడ్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నడిపించిన తీరు చర్చనీయాంశమైంది. ఆమె తన ఇమేజ్ ను పెంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.