Begin typing your search above and press return to search.

ప్రణబ్ ప్రధాని కావాలనుకోలేదట

By:  Tupaki Desk   |   29 Jan 2016 5:30 PM GMT
ప్రణబ్ ప్రధాని కావాలనుకోలేదట
X
రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన రాజకీయ జీవితంలోని పదహారేళ్ళ కాలంలో చోటు చేసుకున్న పరిణామాలకు తన జ్ఞాపకాలను జోడించి రాసిన పుస్తకం 'ది టర్బులెంట్‌ ఇయర్స్‌: 1980-1996'(కల్లోలిత సంవత్సరాలు: 1980-1996) రెండవ భాగం గురువారం రిలీజైంది. ఆ పుస్తకం ఇప్పుడు అనేక సంచలనాలకు వేదికవుతోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ఎలాంటి నిందలు మోశారు... అందుకు కారణమెవరు? అయినా వాటన్నిటినీ తట్టుకుని మళ్లీ ఆయన నెహ్రూ కుటుంబ నమ్మకాన్ని ఎలా సంపాదించుకున్నారు వంటి ఎన్నో అంశాలు అందులో ఉన్నాయి. ఇందిరా గాంధీ దుర్మరణం.. ఆ తరువాత ప్రధానిగా రాజీవ్‌ గాంధీ పేరు ప్రస్తావించడానికి మధ్య చోటు చేసుకున్న పరిణామాలు ఉత్కంఠభరితమైన రాజ కీయ ఊహాగానాలకు ఊతమిచ్చాయి. అత్యున్నత పదవి కోసం ప్రణబ్‌ ముఖర్జీ పావులు కదిపారనే మాటలు కూడా అప్పట్లో వినిపించాయి. అలాంటి ఊహాగానాలకు తెరదించుతున్నట్టుగా ఇందిరా గాంధీ మరణానంతరం ప్రధాని పదవిని తాను ఆశించలేదని ప్రణబ్‌ ముఖర్జీ తాజా పుస్తకంలో స్పష్టం చేశారు. అయితే... రాజీవ్ గాంధీకి తనపై ఎవరో చాడీలు చెప్పారంటూ రాజీవ్ తన పట్ల కక్షతో వ్యవహరించారన్న విషయాన్ని చెప్పకనే చెప్పారాయన. ప్రణబ్ పుస్తకం రెండో భాగంలో ఏముందంటే..

ఇందిరా గాంధీపై అంగరక్షకులు కాల్పులు జరిపిన సమయంలో రాజీవ్‌ గాంధీ పశ్చిమ బెంగాల్‌ లో ఒక బహిరంగలో ప్రసంగిస్తున్నారు. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ సహా ఇతర పార్టీ సీనియర్‌ నేతలు రాజీవ్‌ తో ఉన్నారు. సరిగ్గా అప్పుడే రాజీవ్‌ గాంధీకి పోలీసుల నుంచి ''ఇందిరా గాంధీపై దాడి జరిగింది. వెంటనే ఢిల్లికి రండి'' అనే వైర్‌ లెస్‌ సందేశం వచ్చింది. రాజీవ్‌ తన ప్రసంగాన్ని అర్ధాతరంగా ముగించారు. ఇతర నేతలతో కలిసి హుటాహుటిన ఢిల్లికి విమానంలో బయలుదేరారు. మార్గం మధ్యలో 'ఇందిరా గాంధీ దేహంలోకి 16 తూటాలు వెళ్లాయి' అనే వార్తను రేడియోలో విన్నారు. దీంతో కలత చెందిన రాజీవ్‌ ఆ తూటాలు ఎంత ప్రాణాంతకమైనవని తన వ్యక్తిగత భద్రతాధికారిని(పీఎస్‌ ఓ) ప్రశ్నించారు. అవి చాలా శక్తిమంత మైనవని పీఎస్‌ ఓ బదులిచ్చాడని ప్రణబ్‌ గుర్తు చేసుకున్నారు. ''అప్పుడు వెంటనే రాజీవ్‌ అత్యంత భావోద్వేగంతో మావైపు తిరిగారు. 'ఆమె తూటాలన్నింటినీ తట్టుకుంటారా?'అని ప్రశ్నించారు. మేమంతా తీవ్రమైన దిగ్భ్రాంతితో అలా కూర్చుండిపోయాం'' అని ముఖర్జీ రాసుకొచ్చారు.

కలకత్తా నుంచి న్యూఢిల్లికి తిరిగి వస్తుండగా ప్రణబ్‌ ముఖర్జీ సహా రైల్వే మంత్రి ఎ.బి.ఎ.ఘనీ ఖాన్‌ చౌదరి - లోక్‌ సభ స్పీకర్‌ బలరామ్‌ జక్కర్‌ లాంటి సీనియర్‌ నేతలు రాజీవ్‌ గాంధీకి నచ్చచెప్పడం ప్రారంభించారు. మధ్యంతర ఏర్పాటుకు బదులుగా పూర్తి స్థాయి ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. అప్పట్లో 49 ఏళ్ల వయస్సున్న ప్రణబ్‌ 40 ఏళ్ల రాజీవ్‌ ను విమానం వెనుక భాగానికి తీసుకువెళ్లారు. ఏం నిర్ణయం తీసుకున్నారని ఆయన్ను అడిగారు. ''నేనందుకు తగినవాడి నని మీరనకుంటున్నారా?'' అని రాజీవ్‌ సందేహం వ్యక్తం చేశారు. ''అవును. మీరు తగినవారే. మేమంతా మీకు సాయంగా ఉంటాం. అందరి మద్దతు మీకుంటుంది'' అని ముఖర్జీ బదులిచ్చారు. అయితే జవహర్‌ లాల్‌ నెహ్రూ - లాల్‌ బహదూర్‌ శాస్త్రిల మరణానంతరం సీనియర్‌ మంత్రి గుల్జారీలాల్‌ నందా తరహాలో ప్రధాని పదవిని చేపట్టాలని కేబినెట్‌ కార్యదర్శి కృష్ణస్వామి రావు తనకు నచ్చచెప్పారని ప్రణబ్‌ ముఖర్జీ రాసుకొచ్చారు. అప్పట్లో ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఆయనే సీనియర్‌ మంత్రి కావడంతో వారు ఆ సూచన చేశారు.

అయితే రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారని రావుతో ముఖర్జీ అన్నారు. పార్టీ పార్లమెంటరీ నేతగా రాజీవ్‌ గాంధీని ఎన్నుకుంటూ కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయం... ప్రభుత్వ ఏర్పాటుకు రాజీవ్‌ ను ఆహ్వా నించాలంటూ రాష్ట్రపతి జైల్‌ సింగ్‌ కు రాసిన లేఖను రూపొందించింది స్వయంగా తానేనని ఆయన పుస్తకంలో పేర్కొ న్నారు. ''ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని తాను ఆశిస్తున్నట్టుగా అనేక కథలు చక్కర్లు కొట్టాయి. అంతా అనుకున్నట్టు జరిగితే నేను ప్రధాని అయ్యేవాడినని పేర్కొన్నాయి. అవి పూర్తిగా అవాస్తవం... ఆధారరహితం'' అని రాష్ట్రపతి రాసుకొచ్చారు. తానెప్పుడూ ప్రధాని కావాలని అనుకోలేదని స్పష్టం చేశారు.

ప్రణబ్ తన తాజా పుస్తకంలో ఇందిరాగాంధీ హత్య అనంతర రాజకీయ పరిణామాలపై వివరణ ఇచ్చారు. తాను ప్రధాని కాదలుచుకోలేదని చెప్పడంతో పాటు తాను ప్రధాని అవుతానని వచ్చిన ఊహాగానాల వల్ల నష్టపోయానని పేర్కొన్నారు. ఆ దెబ్బకు ఆయనకు కాంగ్రెస్‌ పార్టీతో సంబంధాలు తెగిపోయాయి. 1986, ఏప్రిల్‌లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పుడే సొంతంగా రాష్ట్రీయ సమాజ్‌ వాది కాంగ్రెస్‌ పార్టీని ఆయన ప్రారంభించారు. ''అప్పట్లో ఎలాంటి దురుద్దేశం లేకుండా నేను చేసిన పనులను నా విరోధులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వాటిద్వారా రాజీవ్‌ గాంధీ నాయకత్వాన్ని నేను అంగీకరించడం లేదన్నట్టుగా చూపారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుందల్లా ఒక్కటే... ఆయన(రాజీవ్‌) తప్పిదాలకు పాల్పడ్డారు. నేనూ తప్పులు చేశాను'' అని ప్రణబ్‌ ముఖర్జీ తన పుస్తకంలో అంగీకరించారు. ''ఆయన ఇతరుల ప్రభావాన్ని తనపై పడనిస్తారు. నాపై వారు చెప్పే చాడీలను వింటారు. అప్పుడే నాలోని సహనాన్ని నైరాశ్యం అధిగమించింది'' అని పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత ముఖర్జీ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారు. అప్పుడే తెలిసింది... ఆయన్ను బహిష్కరిస్తూ రూపొందించిన లేఖపై రాజీవ్‌ గాంధీ సంతకం పెట్టలేదని. దాంతో ప్రణబ్ కూడా తన మనసులో ఏమూలో రాజీవ్ పై ఉన్న అనుమానాన్ని చెరివేసుకున్నారట.