Begin typing your search above and press return to search.

శభాష్; చేసిన తప్పును ఎంత బాగా ఒప్పుకున్నాడు

By:  Tupaki Desk   |   17 Jan 2016 9:29 AM GMT
శభాష్; చేసిన తప్పును ఎంత బాగా ఒప్పుకున్నాడు
X
తప్పులు చేయటం మామూలే. కానీ.. చేసిన తప్పుల్ని హుందాగా ఒప్పుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. ఇక.. రాజకీయ నాయకుల్లో అలాంటి వారు చాలా చాలా తక్కువ. అందులోకి అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి సంగతి అస్సలు చెప్పక్కర్లేదు. మాట వరసకు కూడా తాము చేసిన తప్పుల గురించి ప్రస్తావించటాన్ని నామోషీగా ఫీలవుతుంటారు. కానీ.. అలాంటిదేమీ లేకుండా దేశ ప్రధమ పౌరుడు సరికొత్త కల్చర్ ను షురూ చేశారు. తాను దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని విషయాన్ని ప్రస్తావించటమే కాదు.. తాను తప్పు చేశానని రాష్ట్రపతి హోదాలో ఉండి కూడా చెప్పటానికి వెనుకాడలేదు.

స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. స్టార్టప్ పరిశ్రమల విషయంలో దేశం చాలా ఆలస్యంగా మేల్కొందని.. ఈ ఆలస్యంతో తన బాధ్యత కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీ నుంచి వచ్చిన సీఈవోల ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా తాను ఆర్థికమంత్రిగా పని చేసిన సమయంలో స్టార్టఫ్ విషయంలో తాను తప్పు చేసినట్లుగా చెప్పటం గమనార్హం.

చిన్న వ్యాపారులకు.. పారిశ్రామికవేత్తలకు అనుకూలమై వాతావరణంలో కల్పించటంలో జరిగిన జాప్యం గురించి మాట్లాడుతూ.. దీనికి కారణం వేరెవరిపైనా తాను వేయలేనని.. తన మీదనే వేసుకుంటానని వ్యాఖ్యానించారు. ‘‘నెపం ఎవరి మీదా వేయను. నా మీదనే వేసుకుంటాను. ఎందుకంటే.. నేను గత ప్రభుత్వంలో చాలాకాలం పని చేశాను’’ అంటూ తప్పును నిజాయితీగా ఒప్పుకొని సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఏది ఏమైనా.. జరిగిపోయిన తప్పును ఒప్పుకొని రాష్ట్రపతి ప్రణబ్ దా అందరి మనసుల్ని గెలుచుకున్నారని చెప్పక తప్పదు.