Begin typing your search above and press return to search.

ఆ ఎయిర్ హోస్టెస్ ఎవ‌రో తెలిస్తే షాక్ అవుతారు!

By:  Tupaki Desk   |   22 July 2017 5:37 PM GMT
ఆ ఎయిర్ హోస్టెస్ ఎవ‌రో తెలిస్తే షాక్ అవుతారు!
X
ప్ర‌స్తుతం ఛోటా మోటా రాజ‌కీయ నాయ‌కుల వారసులు త‌మ తండ్రుల పేర్లు బీభ‌త్సంగా వాడేస్తున్నఘ‌ట‌న‌లు మ‌నం చూస్తూనే ఉన్నాం. ఓ సాధార‌ణ కార్పొరేట‌ర్ కొడుకు కూడా క‌లెక్ట‌ర్ రేంజ్ లో బిల్డ‌ప్ లు ఇస్తుంటాడు. ఇక ఏ ఎమ్మెల్యే, ఎంపీ పుత్ర ర‌త్న‌మో అయితే ఆ హ‌డావిడి అంతా ఇంతా కాదు. కానీ, త‌న తండ్రి ఓ దేశానికే ఉన్న‌త ప‌ద‌విలో ఉన్నా కూడా సాధార‌ణ వ్య‌క్తిగా చ‌లామ‌ణి అవ‌డం కొంద‌రికి మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. అటువంటి అరుదైన వ్య‌క్తుల్లో ఒక‌రు రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ కుమార్తె స్వాతి.

రాష్ట్రప‌తి అభ్యర్థి రేసులోకి రానంత వ‌ర‌కూ రామ్‌నాథ్‌ కోవింద్ పేరు పెద్ద‌గా ఎవ‌రికీ తెలీదు. ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ గా ప‌నిచేస్తున్న బిహార్ ప్ర‌జ‌లకు మాత్రమే సుప‌రిచితుడు. ఆయన కుమార్తె విషయంలోనూ కూడా అదే ప‌రిస్థితి. ఆయ‌న కుమార్తె స్వాతి ఎయిరిండియాలో ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌కోవింద్‌ ఎన్నికయ్యేంత వరకు ఆమె ఎవ‌ర‌నే సంగ‌తి అక్కడి ఉద్యోగులకు తెలియ‌కపోవడం గమనార్హం.

నిరాడంబ‌ర‌త‌లో తండ్రికి త‌గ్గ త‌న‌య అనిపించుకున్నారు స్వాతి. ఎయిరిండియా ఉద్యోగుల‌కు తాను బిహార్ గ‌వ‌ర్న‌ర్ రామ్ నాథ్ కోవింద్ కుమార్తె అని కూడా ఎప్పుడూ చెప్పక‌పోవ‌డం ఆమె సింప్లిసిటీకి నిద‌ర్శ‌నం.ఆమె ఎప్పుడూ సాధారణ ఉద్యోగిలానే వ్యవహరించారే తప్ప గొప్పలకు పోలేదని ఎయిరిండియా ఉద్యోగి ఒక‌రు చెప్పారు. తన తండ్రి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఆమె సెలవులపై వెళ్లిన‌పుడు కూడా సెలవులకు గల కారణాన్ని తెలపకపోవడం గమనార్హం.

ఎయిరిండియా ఆఫీసులో త‌న‌ అధికారిక వివరాల్లోనూ ఇంటి పేరును చేర్చకపోవడం విశేషం. అక్క‌డ త‌న‌ తల్లి పేరును సవిత అని, తండ్రి పేరును ఆర్‌ ఎన్‌ కోవింద్‌ అని మాత్రమే ఆమె పేర్కొన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆమెను తమ సహోద్యోగి అని చెప్పుకోవడానికి తాము గర్విస్తున్నామని అక్కడి సిబ్బంది అంటున్నారు. మరోవైపు ఎయిరిండియాను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశీలించాలని రాష్ట్రపతి కోవింద్‌కు విన్నవించాలని అక్కడి సిబ్బంది భావిస్తున్నారు.