Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన?..బాంబేసింది బీజేపీ ఎమ్మెల్యేనే!

By:  Tupaki Desk   |   1 Nov 2019 2:09 PM GMT
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన?..బాంబేసింది బీజేపీ ఎమ్మెల్యేనే!
X
ఏంటేంటీ... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలు కానుందా? బీజేపీ కూటమి క్లిస్టర్ క్లియర్ మెజారిటీ సాధించినా కూడా ఈ తరహా ప్రమాదం పొంచి ఉందా? అసలు ఈ వాదనను కొత్తగా తెర మీదకు తెచ్చిన పార్టీ ఏది? ఇలా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుందన్న వార్త వినిపించగానే.. ప్రశ్నల పరంపర దిగేసింది. అయితే బీజేపీ కూటమికి మెజారిటీ వచ్చినా కూడా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు అవకాశాలు లేకపోలేదన్న మాటను ఆ కూటమి వ్యతిరేక వర్గానికి చెందిన నేత నోట వినిపించలేదు. ఆ కూటమిలోని ప్రధాన పక్షం బీజేపీకి చెందిన ఎమ్మెల్యేనే ఈ బాంబులాంటి మాటను పలికారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుధీర్ ముంగటివార్... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత... అక్కడ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం కొనసాగుతోంది. ఫలితాలు వచ్చి వారం రోజులైనా బీజేపీ-శివసేన మధ్య ఒప్పందం కొలిక్కి రాలేదు. 50-50 ఫార్ములా ప్రకారం సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనని శివసేన పట్టుబట్టుడుతోంది. అలా ఎలా కుదురుతుందని వాదిస్తున్న బీజేపీ... అందుకు ససేమిరా అంటోంది. కూటమిలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకున్న తమకే సీఎం సీటు దక్కాలని, శివసేనకు వచ్చిన సీట్ల ఆధారంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కీలక మంత్రి పదవులు - డిప్యూటీ సీఎం లాంటి పదవులు ఇస్తామని కూడా చెబుతోంది. అయితే శివసేన అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల మధ్య ఫిఫ్టీ ఫిఫ్టీ ఒప్పందం కుదిరేలా కనిపించడం లేదు. ఆ ఒప్పందమే కుదరకుంటే... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పదంటూ సుధీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబరు 7 లోపు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరకుంటే రాష్ట్రపతి పాలన వస్తుందని ఆయన బాంబు పేల్చారు.

288 అసెంబ్లీ సీట్లు మహారాష్ట్రలో బీజేపీ కూటమి 163 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 103 స్థానాలకే పరిమితమైంది. ఇతరులకు 22 స్థానాలు దక్కాయి. బీజేపీ కూటమిలో బీజేపీకి 105 సీట్లు రాగా..శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. ఐతే సీట్ల పంపకానికి ముందే 50-50 ఫార్ములాతో ఒప్పందం చేసుకున్నామని.. దాన్ని అమలు చేయాలని శివసేన పట్టబట్టుతోంది. దీని ప్రకారం చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇలా మిత్రపక్షాలు పోటాపోటీగా సీఎం పీఠంపై కన్నేయడంతో మరాఠా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ ఒప్పందంపై బీజేపీ సైలెంట్ గా ఉంటున్న నేపథ్యంలో శివసేన... ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఒప్పందానికి బీజేపీ ఒప్పుకోకుంటే... కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో తానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా శివసేన ముందుకు సాగుతోంది. ఇలాంటి వార్తల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ చేసిన రాష్ట్రపతి పాలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.