Begin typing your search above and press return to search.

కొత్త రాష్ట్ర‌ప‌తి తొలి ప్ర‌సంగంలో చెప్పిందిదే!

By:  Tupaki Desk   |   25 July 2022 6:59 AM GMT
కొత్త రాష్ట్ర‌ప‌తి తొలి ప్ర‌సంగంలో చెప్పిందిదే!
X
భార‌త‌దేశ 15వ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన ద్రౌప‌ది ముర్ము జూలై 25 సోమ‌వారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. తొలి గిరిజ‌న రాష్ట్ర‌ప‌తిగా, తొలి గిరిజ‌న మ‌హిళా రాష్ట్ర‌ప‌తిగా, ఇప్ప‌టివ‌ర‌కు బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌వారిలో అతి చిన్న‌వ‌య‌సులో రాష్ట్ర‌ప‌తి అయిన‌వారిగా, దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చాక జ‌న్మించిన తొలి రాష్ట్ర‌ప‌తిగా, దేశ రెండో మ‌హిళా రాష్ట్ర‌ప‌తిగా ఇలా పలు రికార్డులు త‌న ఖాతాలో వేసుకున్న ద్రౌప‌ది ముర్ము చేత సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించిన ద్రౌప‌ది ముర్ము దేశ గొప్ప‌త‌నాన్ని చాటారు. 75వ దేశ స్వాతంత్య్ర ఉత్స‌వాల స‌మ‌యంలో ఒక గిరిజ‌న మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తిని చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దేశంలో పేద‌లు సైతం క‌లలు కనొచ్చ‌ని.. ఆ క‌ల‌ల‌ను దేశం సాకారం చేస్తుంద‌ని చెప్పారు. అందుకు తానే ఉదాహ‌ర‌ణ అన్నారు. ఒక గిరిజ‌న మ‌హిళ‌ను దేశ అత్యున్న‌త‌పీఠంపై కూర్చోబెట్ట‌డం దేశ గొప్ప‌తనానికి చిహ్న‌మ‌న్నారు.

తాను రాష్ట్రపతిగా ఎన్నిక కావటం ఆదివాసీల విజయం అన్నారు. త‌మ‌ గ్రామంలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను తానేన‌ని ఆమె గుర్తు చేసుకున్నారు. త‌మ గ్రామంలో బాలికలు స్కూల్ కు వెళ్లటం ఎంతో పెద్ద విషయం అని తెలిపారు. పేద‌లు కూడా త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌చ్చు అని త‌న‌తో రుజువైంద‌న్నారు. మీ న‌మ్మ‌కం, మ‌ద్ద‌తు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించేందుకు త‌న‌కు శ‌క్తినిస్తుంద‌న్నారు. భార‌త్‌ స్వాతంత్య్రం సాధించిన త‌ర్వాత పుట్టిన తొలి రాష్ట్ర‌ప‌తిని తానే అన్నారు.

దేశ ప్ర‌జ‌ల విశ్వాసం నిల‌బెట్టుకునేలా పనిచేస్తాన‌న్నారు. దేశంలో మ‌రింత వేగంగా అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల్సి ఉందన్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు ఆశ‌యాల‌కు త‌గిన‌ట్లు అభివృద్ధిలో వేగం పెంచాల‌న్నారు.

రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని చేప‌ట్టడాన్ని త‌న వ్య‌క్తిగ‌త ఘ‌న‌త‌గా భావించ‌డం లేద‌ని.. ఇది భార‌త్‌లో ఉన్న ప్ర‌తి పేద‌వాడి ఘ‌న‌త‌ అని చెప్పారు. ఇన్నాళ్లూ అభివృద్ధికి దూరంగా ఉన్న పేద‌లు, ద‌ళితులు, వెనుక‌బ‌డిన‌వాళ్లు, గిరిజ‌నులు, త‌న‌ను ఆశాకిర‌ణంగా చూడ‌వ‌చ్చన్నారు. త‌న నామినేష‌న్ వెనుక పేద‌ల ఆశీస్సులు ఉన్నాయ‌ని రాష్ట్ర‌ప‌తి ముర్ము అన్నారు.

జూలై 26న కార్గిల్ దివస్ ను జరుపుకుంటున్నామ‌ని.. కార్గిల్ విజయ్ దివస్ భారత్ శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. విజయ్ దివస్ సందర్భంగా ముర్ము దేశ ప్రజల‌కు శుభాకాంక్షలు తెలిపారు.