Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి ఎన్నికలు.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ!?

By:  Tupaki Desk   |   15 Jun 2022 4:40 AM GMT
రాష్ట్రపతి ఎన్నికలు.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ!?
X
జూలై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గాంధీజీ-సి.రాజగోపాలాచారిల మనవడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ(77)ని బరిలోకి దించాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు ఈ విషయంపై ఆయనతో చర్చించాయని చెబుతున్నారు. ఆయన సానుకూలంగా స్పందించారని ఆయా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. జూన్ 15 బుధవారంలోగా తన నిర్ణయం తెలియజేస్తానని గోపాలకృష్ణ గాంధీ చెప్పినట్టు సమాచారం.

కాగా గోపాలకృష్ణ గాంధీ దక్షిణాఫ్రికా, శ్రీలంకలతోపాటు పలు దేశాల్లో భారత రాయబారిగా పనిచేశారు. 2017లో ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయనను ప్రతిపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి. అయితే ఆ ఎన్నికల్లో వెంకయ్యనాయుడిపై పోటీచేసి గోపాలకృష్ణగాంధీ ఓడిపోయారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లోనూ పోటీకి ఆయన అంగీకరిస్తే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆయననే తమ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నిలుపుతాయని తెలుస్తోంది.

మరోవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ ని రంగంలోకి దించాలని ప్రతిపక్ష పార్టీలు అనుకున్నప్పటికీ ఆయన అంగీకరించలేదని చెబుతున్నారు. శరద్ పవార్ ని ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించడానికి అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నాయి.

అయితే ఇంకా ప్రధానమంత్రి పదవిపైన శరద్ పవార్ కు ఆశ చావలేదని.. ఎప్పటికైనా ప్రధానమంత్రి కావాలని ఆయన కలలు కంటున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖత ప్రదర్శిస్తున్నారని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ కాకుంటే మరికొన్ని పేర్లను కూడా ప్రతిపక్షాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా.. శరద్ పవార్‌ ఢిల్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు-పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, ఎన్‌సీపీ నేతలు ప్రఫుల్‌ పటేల్‌, పీసీ చాకోలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. జూలై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి ఆయన్ను ఒప్పించేందుకు వారు ప్రయత్నించారు. కానీ ఆయన నిరాకరించినట్లు ఏచూరి తెలిపారు.

మరోవైపు రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిపై చర్చించడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటుచేసిన సమావేశం జూలై 15న బుధవారం జరగనుంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మమత తనతో సమావేశానికి టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఆహ్వానించని సంగతి తెలిసిందే. ఇంకోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించేందుకు మమత ప్రయత్నించడంపై కాంగ్రెస్‌ గుర్రుగా ఉన్నా.. ఈ సమావేశానికి వెళ్లాలని నిర్ణయించింది. పార్టీ తరఫున సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, జైరాం రమేశ్‌ వెళ్లనున్నారు.