Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి పాలన కాదు...రాష్ట్రపతి ఎన్నికలు...?

By:  Tupaki Desk   |   24 Oct 2021 1:30 AM GMT
రాష్ట్రపతి పాలన కాదు...రాష్ట్రపతి ఎన్నికలు...?
X
కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాల మీద పెత్తనం చేయాలంటే కుదిరే రోజులు కావివి. మొదట్లో అంటే యాభై నుంచి డెబ్బై ఎనభై దశకం వరకూ చూస్తే చాలా సులువుగా ఎలాంటి కారణాలు పెద్దగా లేకుండా రాష్ట్రపతి పాలనను పెట్టేసేవారు, కానీ 90లలో కర్నాటకు చెందిన ఎస్సార్ బొమ్మై కేసులో సుప్రీం కోర్టు తీర్పు తరువాత సహేతుకమైన కారణాలు లేకుండా 356 అధికరణాన్ని ప్రయోగిస్తే అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. అందుకే గత రెండు దశాబ్దాలుగా చూసుకుంటే దేశంలో రాష్ట్రపతి పాలన పెట్టిన సందర్భాలు బాగా తగ్గాయి. ఇక ఏపీలో చూసుకుంటే పరిస్థితి స్మూత్ గానే ఉంది. జన జీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగడంలేదు. ఇక రాజకీయ పార్టీలు అన్నీ కూడా రాష్ట్రపతి పాలన పెట్టమని మూకుమ్మడి డిమాండ్ అయితే చేయడంలేదు. కేవలం టీడీపీ మాత్రమే ఈ స్లోగన్ అందుకుంటోంది.

మరి టీడీపీ పెట్టమంటే పెట్టేస్తారా, రాజ్యాంగం, సుప్రీం కోర్టు తీర్పులు వంటివి చూసుకోరా అంటే అన్నీ చూసుకుంటారు. వాటితో పాటు రాజకీయాలూ చాలానే చూసుకుంటారు. ఏపీనే తీసుకుంటే టీడీపీ కంటే వైసీపీ తోనే కేంద్రానికి చాలా అవసరాలు ఉన్నాయి. రాజ్యసభలో ఈ రోజుకీ సరైన నంబర్ అధికార పార్టీకి లేదు. అక్కడ ఆరుగురు ఎంపీలు ఉన్న వైసీపీయే కీలక ఆధారం. దానితో పాటు 2022 జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలో ఇపుడున్న పరిస్థితులు తీసుకున్నా 2022 లో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలను తీసుకున్నా బీజేపీకి రోజులు ఏమంత బాగులేవు.

అందువల్ల రాష్ట్రపతి ఎన్నికల్లో సొంతంగా తమ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు ఎలక్ట్రోల్ కాలేజీలో సరిపడా నంబర్ బీజేపీకి లేదు. అలాగే ఆగస్ట్ లో ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. మరి దానికి కూడా వైసీపీ మద్దతు కావాలి. వైసీపీకి 22 మంది ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు, 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దాంతో ఎలక్ట్రోల్ కాలేజీలో వైసీపీ కీలకంగా ఉంది. మరి ఈ లెక్కలు అన్నీ కేంద్రంలోకి బీజేపీ పెద్దలకు తెలియకుండా ఉంటాయా. అందుకే వారు రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రపతి ఎన్నికల‌ దగ్గరనే ఆగిపోతారు తప్ప అంతకు మించి ముందుకు పోలేరు అంటున్నారు.

అసలు ఆ డిమాండ్ లో సహేతుకత కూడా లేని పరిస్థితి ఉంది. నిజానికి ఏపీ ఇంతకు పదింతలుగా ఇబ్బందులు పడుతూ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే అపుడు కూడా సీరియస్ గా ఆలోచించడానికి బీజేపీ నేతలు కొంత ఇబ్బంది పడతారు. అలాంటిది సడెన్ గా మబ్బులు ముసిరి గట్టిగా గంట సేపు వాన కురిసి వెలసినట్లుగా ఏపీలో జరిగిన కొన్ని సంఘటలను తీసుకుని రాష్ట్రపతిపాలన అని టీడీపీ అంటే బీజేపీ అందుకు ఓకే అని ఎలా అంటుంది. నిజానికి టీడీపీ పెద్దలకు కూడా ఈ విషయాలు తెలియనవికి కావు, కానీ ఆ పేరు చెప్పి జనాల్లో ఏపీ సర్కార్ ని బదనాం చేయాలన్న వ్యూహంతోనే ఇంత పెద్ద డిమాండ్ ని ముందుకు తెచ్చారు అంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రపతిపాలన టీడీపీ నోట రావడం అది కూడా ఈ టైమ్ లో వింతా విడ్డూరమే అని చెప్పాలి మరి.