Begin typing your search above and press return to search.

కోవిడ్ రికవరీ వేళ.. ఉక్రెయిన్ ఎపిసోడ్ లో వేటి ధరలు మండుతాయి?

By:  Tupaki Desk   |   23 Feb 2022 4:36 AM GMT
కోవిడ్ రికవరీ వేళ.. ఉక్రెయిన్ ఎపిసోడ్ లో వేటి ధరలు మండుతాయి?
X
ఒకటి తర్వాత ఒకటి చొప్పున టాస్కులు బిగ్ బాస్ హౌస్ లోనే కాదు.. ప్రపంచంలోనూ చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్ విప్లవం పుణ్యమా అని ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోవటం.. ప్రతి దేశంతో మరో దేశానికి సంబంధాలు మాత్రమే కాదు.. ఒక దేశానికి జలుబు చేస్తే.. మరో దేశానికి తుమ్ములు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని వెంటాడి వేధిస్తున్న కొవిడ్ నుంచి ఇప్పపుడిప్పుడే బయటకు వచ్చి.. రికవరీ మూడ్ లో ఉన్న వేళ.. రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ లో (సోవియెట్ యూనియన్ లో రష్యాలో భాగమై.. ఆ తర్వాత స్వతంత్ర్య దేశంగా మారింది) నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచం మీద పడనుంది.

అంతేకాదు.. మన దేశం మీదా ఆ యుద్ధ ప్రభావం ఖాయంగా ఉంది. ఇప్పుడీ యుద్ధం ముంచుకొస్తే.. వివిధ దేశాలపై భద్రతాపరంగానే కాదు.. ఆర్థికంగానూ ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు చమురు రవాణాకు ఆటంకాలు ఎదురవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వాదనకు తగ్గట్లే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి.

తాజాగా బ్యారెల్ ముడి చమురు 97 డాలర్లకు చేరిన నేపథ్యంలో.. దిగుమతులపై పెద్ద ఎత్తున ఆధారపడే భారత్ లాంటి దేశానికి తలనొప్పులు తప్పవనే చెప్పాలి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. కేంద్రం మాత్రం పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే పెట్రోల్.. డీజిల్ ధరల్లో మార్పులు ఖాయమంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ ఎపిసోడ్ తో స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులు నెలకొంటున్నాయి. ఉక్రెయిన్ తో వాణిజ్య సంబంధాలు ఉన్న దేశంగా మనకు.. తాజాగా యుద్ధం జరిగితే మాత్రం బోలెడన్ని సమస్యలు ఖాయమంటున్నారు. ఉక్రెయిన్ తో మన దేశానికి ఉన్న సంబంధాన్ని చూస్తే.. మన దేశం నుంచి ఆ దేశానికి మందులు ఎక్కువ మోతాదులో సరఫరా అవుతుంటాయి. ఉక్రెయిన్ కు మెడిసిన్స్ ను ఎక్కువగా ఎగుమతి చేసే టాప్ మూడు దేశాల్లో భారత్ కు మూడో స్థానంలో ఉంది.

మన దేశానికి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీల ఆఫీసులు ఉక్రెయిన్ లో ఉన్నాయి. వీటితో పాటు రియాక్టర్లు.. బాయిలర్ యంత్రాలు.. మెకానికల్ సామాగ్రి.. నూనె గింజలు.. పండ్లు.. కాఫీ.. తేయాకు లాంటివి ఆ దేశానికి భారత్ ఎగుమతి చేస్తుంటుంది. అదే సమయంలో మనకు సన్ ఫ్లవర్ ఆయిల్ ను పెద్ద ఎత్తున ఉక్రెయిన్ దిగుమతి చేస్తుంది. దీంతోపాటు.. ఇనుము.. ఉక్కు.. ప్లాస్టిక్.. రసాయనాలను ఉక్రెయిన్ నుంచి దిగుమంతి అవుతుంటాయి.

ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం రూ.19వేల కోట్లుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉద్రిక్తతలు పెరిగే కొద్దీ.. దాని ప్రభావం మన దేశం మీదా.. ధరల మీదా పడటం ఖాయమని చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే.. మొదట ధరలు పెరిగేది పెట్రోల్.. డీజిల్ అయితే.. ఆ తర్వాత సన్ ఫ్లవర్ ఆయిల్ ధర కూడా పెరగటం ఖాయం.