Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ యుద్ధం: పేలుతున్న ధరలు

By:  Tupaki Desk   |   2 March 2022 4:30 PM GMT
ఉక్రెయిన్ యుద్ధం: పేలుతున్న ధరలు
X
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్ కుదేలవుతోంది. ధరలు భారీగా పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్, బంగారం ధరలు ఒక్కసారిగా మంగళవారం భగ్గుమన్నాయి. చమురు ధర ఆకాశాన్ని అంటుతోంది. బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 10 డాలర్లకు పైగా పెరిగి (10శాతం పైగా) 111.70 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నైమెక్స్ క్రూడ్ కూడా ఇదే స్థాయిలో పెరిగింది.

ఇప్పటివరకూ క్రూడ్ గరిష్ట స్థాయి 147 డాలర్లు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 2008 జూలైలో క్రూడ్ ఆయిల్ ఈ స్థాయిని అందుకుంది.

ఇక బంగారం ఔన్స్ ధర 36 డాలర్లు పెరిగి 1938 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ ఇండెక్స్ ఒక శాతం లాభంతో 97.50 వద్ద ట్రేడ్ అవుతుండగా.. డాలర్ తో రూపాయి విలువ భారీ నష్టంతో 76కు చేరువలో ఉంది.

ఉక్రెయిన్ నగరాలపై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. యూరప్ లో బ్రిటన్ మార్కుట్ రెండు శాతం క్షీణించింది. జర్మనీ, ఫ్రాన్స్, స్టాక్ సూచీలు నాలుగు శాతం నష్టపోయాయి.

అమెరికా 500 సూచీ రెండు శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యాను కట్టడి చేసేందుకు రష్యా బ్యాంకులకు అమెరికా, దాని మిత్ర దేశాలు స్విఫ్ట్ సేవలను నిలిపివేశాయి. ఫలితంగా ఆ దేశ కరెన్సీ రూబెల్ మరోసారి కనిష్టానికి పడిపోయింది.

నవంబర్ మొదటి వారం నుంచి రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు నుంచి సామాన్యులకు ఊరట లభిస్తోంది. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం, ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడం లేదు. లేదంటే మోత మోగిస్తాయి.అయితే బల్క్ డీజిల్ ధరలు మాత్రం భారీగా పెంచారు.

డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ సహా అన్ని సంస్థలు ధరలు పెంచుతున్నాయి. దీంతో వంట గ్యాస్ కూడా ధర పెరిగింది. పామాయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.