Begin typing your search above and press return to search.

అత్యవసరంగా పార్లమెంటు సమావేశాలు పెడతారా? మోదీజీ?

By:  Tupaki Desk   |   19 Nov 2021 11:36 AM GMT
అత్యవసరంగా పార్లమెంటు సమావేశాలు పెడతారా? మోదీజీ?
X
ఈ రోజు ఉదయం చాలామందికి అతి పెద్ద సంచలన వార్తతో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది తెచ్చిన సాగు నీటి చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఏడాది నుంచి రైతులు ఎంత మొత్తుకున్నా.. రైతు సంఘాల నేతలు ఎంతగా ఆవేదన వ్యక్తం చేసినా.. చలించని మోదీ సర్కారు ఉన్నట్లుండి ఈ నిర్ణయం ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపర్చింది.

కాగా, స్వయంగా మోదీనే సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించినా.. దీనిపై ప్రజలు, మేధావుల్లో అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలు తగ్గి, వచ్చే ఏడాది అతి కీలకమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సాగు చట్టాలను వేరే రూపంలో ప్రవేశపెట్టే ఆలోచన చేస్తారని భావిస్తున్నారు. వ్యవసాయ నిపుణులు కూడా ఇదే పాయింట్ ను అంగీకరిస్తున్నారు.

ఇప్పుడెందుకు కరిగింది కఠిన గుండె

ఢిల్లీ చలికి వణికి.. ఎండకు ఎండి.. వానకు తడుస్తూ గత 13 నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నా మోదీ ప్రభుత్వం మిన్నకుందే గానీ ఏమీ చేయలేదు. ఈ మధ్యలో ఎన్నో ఘటనలు జరిగాయి. గణతంత్ర దినం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోట ముట్టడి, హరియాణలో రైతులపై లాఠీఛార్జి, యూపీలో రైతుల మీదకు కారు పోనిచ్చిన కేంద్ర మంత్రి కుమారుడు.. ఇలా అనేక ఘటనలు జరిగాయి. కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ, వీటిలో దేనినీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఉప ఎన్నికల దెబ్బ.. రానున్న ఎన్నికల మహిమ

గత నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హరియాణలో అధికారంలో ఉండి కూడా ఓడిపోయింది. మరోవైపు వచ్చే ఏడాది పంజాబ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో యూపీ చాలా కీలకం. ఇక్కడ గెలిచే ఎంపీ సీట్లే కేంద్ర ప్రభుత్వంలో ఎవరుండాలనేది నిర్ణయిస్తాయి. కాబట్టి యూపీ కోటను నిలపుపుకోవడం బీజేపీకి ప్రతిష్ఠాత్మకం.

అలాగే పంజాబ్ పూర్తి వ్యవసాయ రాష్ట్రం. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేస్తోంది. అధికార కాంగ్రెస్ కు దీటుగా ఉంటోంది. అకాళీదళ్ తో పొత్తు చెడిన బీజేపీకి పంజాబ్ లో ఒంటరి పోరు తప్పేలా లేదు. అదే జరిగితే కమలం బొక్కబోర్లా పడడం ఖాయం. వీటన్నిటినీ గమనించే బీజేపీ సాగు చట్టాలను వెనక్కు తీసుకుంది.

చిత్తశుద్ధి ఉంట ఇలా చేసేవారు..

నిజంగా సాగు చట్టాలను రద్దు చేయాలనే ఆలోచనే ఉంటే.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, చర్చ జరిపి, అన్ని పక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి, రైతు సంఘాలతో చర్చించి.. హామీ మేరకు రద్దు చేస్తున్నామని ప్రకటించాలని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. అలా చేస్తేనే కేంద్రం మరోసారి సాగు చట్టాలను దొడ్డి దారిన అయినా ప్రవేశ పెట్టకుండా ఉంటుందని, అప్పుడే నమ్మకం కుదురుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

మోదీ.. పీచేముడ్.. ఇదే తొలిసారి

గతేడాది రెండో భాగంలో.. కరోనా ఫస్ట్ వేవ్ కాలంలో.. మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చి.. పార్లమెంటులో ప్రతిష్ఠాత్మకంగా ఆమోదింపజేసుకున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్కసారిగా ఆ చట్టాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు.

దీంతో అధికారంలోకి వచ్చిన ఈ ఏడున్నర సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారి ఓ విధాన అంశంపై వెనకడుగు వేసినట్లయింది. ఆర్టికల్ 370, అయోధ్య, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని అంశాలపై మోదీ సర్కారు ముందుకే వెళ్లింది.కానీ, సాగు చట్టాలపై మాత్రం వెనక్కుతగ్గింది. ఇది కచ్చితంగా రైతు విజయమే..