Begin typing your search above and press return to search.

ప్రపంచ క్రికెట్‌ను భారత్ శాసిస్తోంది: ఇమ్రాన్ ఖాన్

By:  Tupaki Desk   |   12 Oct 2021 7:53 AM GMT
ప్రపంచ క్రికెట్‌ను భారత్ శాసిస్తోంది: ఇమ్రాన్ ఖాన్
X
క్రికెట్ అనగానే గుర్తొచ్చే దేశాలలో ఇండియా ది అగ్రస్థానం. ప్రపంచ క్రికెట్‌ ను భారత్ తన ఆధిపత్యంతో శాసిస్తుందని మాజీ క్రికెటర్లు సైతం పలు సందర్భాలలో ప్రస్తావించేవారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ క్రికెట్‌ పై భారత్ ఆధిపత్యం చెలాయించగల సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. ఇటీవల పాకిస్తాన్ క్రికెటర్ బోర్డ్ చీఫ్ రమీజ్ రాజా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్‌ గేమ్‌ ను భారత్ ప్రభావితం చేస్తుందని, భారత క్రికెట్ నియంత్రణ మండలి తలుచుకుంటే పాక్ క్రికెట్ లేకుండా పోతుందని సంచలన వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు.

ఇతర దేశాల క్రికెట్ బోర్డులను బీసీసీఐ ప్రభావితం చేయగలదన్నారు. ఇటీవల న్యూజిలాండ్ జట్టు పాక్ పర్యటనను రద్దు చేసుకుంది. అంతలోనే పాక్ క్రికెట్ బోర్డుకు మరో షాకిస్తూ, ఇంగ్లాండ్ జట్టు సైతం తమ పర్యటనను రద్దు చేసుకోవడం తెలిసిందే. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు పాక్ పర్యటనను రద్దు చేసుకోవడంపై ఇమ్రాన్ ఖాన్ సైతం తీవ్ర నిరాశకు లోనయ్యారు. బీసీసీఐ ఆర్థిక పరిపుష్టితో మరే ఇతర దేశాల బోర్డులు పోటీ పడలేవని అభిప్రాయపడ్డారు.

ఇంగ్లాండ్ జట్టు విషయానికొస్తే.. పాకిస్తాన్ లాంటి జట్లతో ఆడేందుకు ఇంగ్లీష్ ఆటగాళ్లు ఎప్పటికీ సంసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. డబ్బు కారణంగా వాళ్లు పాక్ పర్యటన విషయంలో వెనక్కి తగ్గారు. మనీ అనేది బిగ్ ప్లేయర్ అని నా అభిప్రాయం. క్రికెట్ బోర్డులకు సైతం డబ్బు అనేది కీలమైన అంశం. అయితే ఆ డబ్బు అనేది బీసీసీఐ, భారత్ చేతిలో ఉందని గుర్తుంచుకోవాలి. ప్రపంచ క్రికెట్‌ను మొత్తం భారత్ శాసిస్తోంది. అందువల్ల ఇతర దేశాలు భారత్ విషయంలో పునరాలోచిస్తాయి అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా బీసీసీఐ అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్ కప్ నిర్వహిస్తోంది. పాక్ సైతం భారత్ గ్రూపులోనే ఉంది. భారత్ తమ తొలి మ్యాచ్ ను అక్టోబర్ 24న పాక్ తో ఆడనుంది. పాక్ క్రికెట్ బోర్డు 50 శాతం ఐసీసీ ఫండ్‌ తో నడుస్తోంది. ఐసీసీకి 90 శాతం ఫండ్ భారత్ నుంచి వస్తుంది. దాంతో పాక్ బోర్డును సైతం భారత్ శాసిస్తున్నట్లే. రేపు ఏదైనా జరిగితే భారత ప్రధాని పాక్ కు నిధులు ఇవ్వలేమని చెప్పినా చెబుతారు. అప్పుడు పాక్ బోర్డు కుప్పకూలినట్లేనని రమీజ్ రాజా వ్యాఖ్యలు చేయడం ఇటీవల సంచలనంగా మారింది. టీ20 వరల్డ్ కప్ ఈవెంట్ కు ముందు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లతో పాకిస్తాన్ వైట్ బాల్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో సెక్యూరిటీ అంశాల రీత్యా నిర్ణయం వెనక్కు తీసుకుంటున్నామని పర్యటనను రద్దు చేసుకున్నాయి. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ ఫిజికల్, మెంటల్ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.