Begin typing your search above and press return to search.

యోగి ట్రాప్‌లో ప్ర‌ధాని... పీక‌ల్లోతు చిక్కుల్లో చిత్రా రామ‌కృష్ణ

By:  Tupaki Desk   |   20 Feb 2022 1:30 AM GMT
యోగి ట్రాప్‌లో ప్ర‌ధాని... పీక‌ల్లోతు చిక్కుల్లో చిత్రా రామ‌కృష్ణ
X
హిమాల‌యాల్లోని ఓ యోగిచే ప్ర‌భావితం అయి నెష‌న‌ల్ స్టాక్ ఎక్సేంజ్ కార్య‌క‌లాపాల్లో తీవ్ర అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న మాజీ సీఈవో చిత్రా రామ‌కృష్ణ ఈ ఎపిసోడ్‌లో పీక‌ల్లోతు ఇరుక్కుపోతున్నారు. సెబీ ద‌ర్యాప్తుల్లో సంచ‌ల‌న వివ‌రాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. సెబీ లిస్టింగ్‌కు సంబంధించి ఏకంగా ప్ర‌ధాన‌మంత్రిని త‌న గేమ్ ప్లాన్‌లో భాగం చేసే ఎత్తుగ‌డ‌లో సైతం ఆమె భాగం అయ్యార‌ని తాజాగా తేలింది.

ఎన్ఎస్ఈ కార్య‌క‌లాపాల్లో అక్ర‌మాల‌కు పాల్పడ్డార‌న్న ఆరోప‌ణ‌ల విష‌యంలో సెబీ సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 2013 నుంచి 2016 మ‌ధ్య కాలంలో ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా చిత్ర ప‌నిచేశారు.

ఈ స‌మ‌యంలో ఎన్ఎస్ఈకి సంబంధించిన కీలక సమాచారాన్ని ఒక హిమాలయ యోగితో చిత్ర పంచుకొన్నారని, ఆయన సూచనలతోనే ఎన్ఎస్ఈ చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌తో పాటు పలు కీలక పదవుల్లో క్యాపిటల్‌ మార్కెటింగ్‌పై ఎలాంటి అవగాహన లేని ఆనంద్‌ సుబ్రమణియన్‌ను నియమించారని సెబీ దర్యాప్తులో ఇటీవల తేలింది. అయితే హిమాల‌యాల్లో నివ‌సించే స‌దరు యోగి స్టాక్ ఎక్స్‌చేంజ్ వ‌ర‌కే ప‌రిమితం కాకుండా ఎన్ఎస్ఈ లిస్టింగ్ విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రిని సైతం ఇరికించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు స‌మాచారం.

ఎన్ఎస్ఈ సెల్ఫ్ లిస్టింగ్ విష‌యంలో ఆర్థిక శాఖ అధికారులు, సంబంధిత మంత్రిని క‌ల‌వాల‌ని అవ‌స‌ర‌మైతే ప్ర‌ధాన‌మంత్రితో సైతం స‌మావేశం అవ్వాల‌ని చిత్ర‌కు పంపించిన ఈమెయిల్లో ఆ యోగి వెల్ల‌డించిన‌ట్లు సెబీ గుర్తించింది. ఈ విష‌యంలో ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్ స‌ల‌హా ఇస్తార‌ని యోగి భ‌రోసా ఇచ్చారు. దీంతో చిత్ర సెల్ఫ్ లిస్టింగ్‌కు ప్ర‌య‌త్నించ‌గా  కో లొకేషన్‌ కుంభకోణం, ఇతర అవకతవకలను పేర్కొంటూ సెబీ ఈ ప్ర‌య‌త్నాల‌కు చెక్ పెట్టింది. కాగా, ప్ర‌ధాన‌మంత్రిని సైతం ఇన్వాల్స్ చేసేలా చిత్ర‌ను న‌డిపించిన స‌ద‌రు యోగి పాత్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇదిలాఉండ‌గా, ఎన్ఎస్ఈ నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న‌, పన్ను ఎగవేత, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై ఐటీశాఖ‌ తనిఖీలు చేపట్టింది. అనంత‌రం చిత్రా రామ‌కృష్ణ‌ను సీబీఐ అధికారులు ప్ర‌శ్నించారు. దీంతోపాటుగా చిత్రా రామ‌కృష్ణ దేశం విడిచి వెళ్ల‌కుండా సీబీఐ లుక్ఔట్ నోటీసు జారీ చేసింది.

ఆమెతోపాటు సంస్థ మ‌రో మాజీ సీఈవో ర‌వి నారాయ‌ణ్, మాజీ సీవోవో ఆనంద్ సుబ్ర‌మ‌ణ్యంల‌పై కూడా లుక్ఔట్ నోటీసులు జారీ చేసింది. గుర్తు తెలియని వ్య‌క్తుల‌తో క‌లిసి కుట్ర‌కు పాల్ప‌డ్డార‌ని సీబీఐ అభియోగం. ఎన్ఎస్ఈ, సెబీల్లో ప‌ని చేసిన‌, చేస్తున్న మ‌రి కొంద‌రిని కూడా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ప్ర‌శ్నించినట్లు స‌మాచారం.