Begin typing your search above and press return to search.

వ్యవసాయ చట్టాలపై దుష్ప్రచారం: మోడీ

By:  Tupaki Desk   |   25 Dec 2020 2:30 PM GMT
వ్యవసాయ చట్టాలపై దుష్ప్రచారం: మోడీ
X
ఢిల్లీ శివారుల్లో 30 రోజులుగా సాగుతున్న రైతుల ఆందోళన ఎంతకూ తగ్గకపోవడం.. ప్రతిపక్షాలు, మేధావులు వారికి మద్దతు ఇస్తున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రైతులను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు.

మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి సందర్భంగా ప్రధాని మోడీ వర్చువల్ మీట్ లో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలపై దుష్ప్రచారం చేస్తున్నారని.. వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారంటూ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొత్త వ్యవసాయ చట్టాలపై కొందరు రాజకీయం చేస్తున్నారని.. కాంట్రాక్టు వ్యవసాయంపై ప్రతిపక్షాలు వదంతులు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ సంస్కరణల గురించి అసంఖ్యాక అబద్ధాలు వ్యాప్తి చెందిస్తున్నారని మోడీ విమర్శించారు. మద్దతు ధరను రద్దు చేస్తున్నట్లు కొంతమంది రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. మార్కెట్లు మూసేస్తున్నారని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు.

ప్రజలు తిరస్కరించిన కొన్ని రాజకీయ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ చట్టాలు అమలై చాలా నెలలు గడిచిపోయాయి. దేశంలోని ఏ మూలలోనైనా ఏదైనా మార్కెట్ మూసేసారన్న వార్తలను మీరు విన్నారా? అని మోడీ రైతులను ప్రశ్నించారు.

బెంగాల్ లో మమతా బెనర్జీ రాజకీయం వల్ల 70 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు అందడం లేదని మోడీ విమర్శించారు. దేశంలో రాజకీయ పక్షాలు రైతులను పావుగా వాడి కేంద్రంపై ఉసిగొల్పుతూ వారిని నష్ట పరుస్తున్నారని మోడీ విమర్శించారు.