Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ కీలక చర్చలు

By:  Tupaki Desk   |   7 March 2022 11:43 AM GMT
ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ కీలక చర్చలు
X
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. భారత ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకూ ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా జరిగిన తీర్మాన ఓటింగ్ లో మూడు సార్లు భారత్ తటస్థ వైఖరి అవలంభించింది. ఉక్రెయిన్ తమకు మద్దతు ఇవ్వాలని భారత్ ను కోరినా రష్యాకు వ్యతిరేకంగా స్టెప్ తీసుకోలేదు. అదేసమయంలో తాము శాంతిని కోరుకుంటున్నామని స్పష్టం చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తోనూ ప్రధాని రెండు సార్లు చర్చలు జరిపారు.

ఇక కొద్దిసేపటి క్రితమే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో మోడీ మాట్లాడారు. దాదాపు 35 నిమిషాల పాటు జరిగిన ఫోన్ కాల్ లో ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించారు. సమస్య పరిష్కారం కోసం రష్యాతో చర్చలు కొనసాగిస్తుండడంపై ఉక్రెయిన్ ను మోడీ అభినందించారు.

సుమీలోని భారతీయులను తరలించడంలో కూడా ఉక్రెయిన్ తన సహకారాన్ని అందించాలని ప్రధాని మోడీ కోరారు. అంతకుముందు ఉక్రెయిన్ కూడా సహాయం కోసం ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోడీ మాట్లాడడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో ఉక్రెయిన్ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా మోడీ ఫోన్ లో మాట్లాడినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యుద్ధంతో అతలాకుతలమవుతోన్న ఉక్రెయిన్ ను ఆర్థికంగా ఆదుకోవడం కోసం బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ దేశానికి 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఉక్రెయినియన్ల సంక్షేమం, ఉద్యోగుల జీతాలు తదితర ఖర్చులకు ఈ నిధులు ఉపయోగపడుతాయని యూకే ప్రభుత్వం వెల్లడించింది.

ఈరోజు ఉక్రెయిన్-రష్యా మధ్య మూడో విడత చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇంతకుముందు రెండు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈసారి చర్చల్లో అయినా ఫలితం పైన ప్రపంచదేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.