Begin typing your search above and press return to search.

సంచలనం లేదు.. షాకింగ్ లేదు.. ఇంత చప్పగానా మోడీ?

By:  Tupaki Desk   |   20 April 2021 4:15 PM GMT
సంచలనం లేదు.. షాకింగ్ లేదు.. ఇంత చప్పగానా మోడీ?
X
దేశ ప్రధానులుగా ఎందరో పీఎం కుర్చీలో కూర్చున్నా.. మరే భారత ప్రధాని చేయని విధంగా.. అకస్మాత్తుగా జాతిని ఉద్దేశిస్తూ ప్రసంగాలు చేయటం మోడీకి ఎంత అలవాటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సంకేతాలు.. ముందస్తుప్రకటనలు చేయకుండా.. చాలా తక్కువ వ్యవధిలో జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఎపిసోడ్ లో మోడీ ట్రాక్ రికార్డు చెరపలేనిది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మునిగిపోయి.. జాతి హితాన్ని.. కరోనాను లైట్ తీసుకున్న పాలకుల తప్పునకు ఈ రోజున యావత్ దేశం విలవిలలాడుతోంది.

ఆసుపత్రుల్లో బెడ్ల కోసం.. ఆక్సిజన్ కోసం కిందా మీదా పడుతున్న వారు కొందరైతే.. తమ కుటుంబ సభ్యుల్ని.. ఆప్తుల్ని కోల్పోయిన వారి శోకాలతో దేశం మారుమోగుతోంది. ఇలాంటివేళ.. ఈ రోజు (మంగళవారం) రాత్రి 8.45 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడాతరన్న వేళ.. ఈసారి ఎలాంటి సంచలన ప్రకటన చేయనున్నారు? మరెలాంటి షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించనున్నారన్న చర్చ జరిగింది.

రోటీన్ కు భిన్నంగా.. సాదాసీదాగా మాట్లాడిన మోడీ.. దేశ ప్రజలకు సెకండ్ వేవ్ లో ఎలాంటి టాస్కులు ఇవ్వకుండా.. జాగ్రత్తగా ఉండాలని చెప్పటంతో పాటు.. తెలిసిన విషయాల్నే మరోమారు చెప్పే ప్రయత్నం చేశారు. అన్నింటికి మించి.. పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్న కరోనా మరణాల విషయంలో.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు సైతం చప్పగా.. మనసును టచ్ చేసేలా ఉండకపోవటం గమనార్హం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్పదంటూ జరిగిన ప్రచారానికి ఒక స్పష్టత ఇచ్చిన మోడీ.. లాక్ డౌన్ అన్నది ఆఖరి ఛాయిస్ అన్న మాట చెప్పటంతో.. ఈసారికి అలాంటిదేమీ లేదన్నది తేల్చేశారని చెప్పాలి. మొత్తంగా ఎలాంటి సంచలనం.. మరెలాంటి షాకింగ్ మాత్రమే కాదు.. దేశ వాసులు ఎదుర్కొంటున్న బాధలపై మోడీ నోట వేదనాభరిత వ్యాఖ్యలు లేకపోవటం ఈసారి ప్రత్యేకతగా చెప్పక తప్పదు.