Begin typing your search above and press return to search.

గంట‌కు ల‌క్ష చొప్పున 38 ల‌క్ష‌ల‌ ఖ‌ర్చు.. ట్రంప్ కోసం ప్ర‌జాధ‌నం పారించిన మోడీ

By:  Tupaki Desk   |   18 Aug 2022 3:50 PM GMT
గంట‌కు ల‌క్ష చొప్పున 38 ల‌క్ష‌ల‌ ఖ‌ర్చు.. ట్రంప్ కోసం ప్ర‌జాధ‌నం పారించిన మోడీ
X
ప్ర‌భుత్వాలు ప్ర‌జాధ‌నాన్ని జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు చేయాల‌ని.. వృథా ఖ‌ర్చులు త‌గ్గించుకోవాల‌ని, ఉచిత ప‌థ‌కాలు నిలిపివేయాల‌ని నీతులు చెబుతున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. త‌ను స్నేహితుడి పేర్కొనే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం.. అదే ప్ర‌జాధ‌నాన్ని వ‌ర‌ద‌లా పారించారు. గంట‌కు ల‌క్ష రూపాయ‌ల చొప్పున 36 గంట్ల‌లో 38 ల‌క్ష‌ల రూపాయ‌ల ప్ర‌జాద‌నం మంచి నీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు చేశారు. ఇది ఎవ‌రి విమ‌ర్శో కాదు.. ఏకంగా కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన మాటే. మ‌రి దీనిని ఏమంటారో.. మోడీనే చెప్పాల‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి.

విష‌యం ఏంటంటే..

రెండేళ్లక్రితం కుటుంబ సమేతంగా ట్రంప్‌ భారత సందర్శనకు వచ్చిన విషయం విధితమే. అయితే ఈ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసిందనే విమర్శలున్నాయి. అయితే వాస్తవంగా ఎంత ఖర్చయ్యిందనేది తాజాగా బహిర్గతమైంది. ట్రంప్ 36 గంటల పర్యటనకు గంట‌కు రూ.ల‌క్ష చొప్పున‌ రూ.38 లక్షలు వ్యయం అయ్యినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. మిషాల్ భతేనా అనే వ్యక్తి ఆర్‌టీఐ దరఖాస్తు వివరాలు కోరగా ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

ట్రంప్ సందర్శన ఖర్చు వివరాలు వెల్లడించాలని అక్టోబర్ 24, 2020న మిషాల్ భతేనా తొలి దరఖాస్తు చేశాడు. దీనికి ఎలాంటి సమాధానమూ రాలేదు. దీంతో నేరుగా ఆర్టీఐ వ్యవహారాల అప్పీలేట్ అథారిటీ ‘సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్’ను మిషాల్ భతేనా ఆశ్రయించాడు. దీంతో ఆగస్టు 4, 2022న విదేశీ వ్యవహారాల శాఖ ట్రంప్ పర్యటన వివరాలు అందజేసింది. కొవిడ్-19 కారణంగా సకాలంలో సమాధానం ఇవ్వలేకపోయామని వివరణ ఇచ్చింది.

దేశాల అత్యున్నత నేతలు, ప్రతినిధుల పర్యటన ఖర్చులను ఆతిథ్య దేశమే భరించాల్సి ఉంటుందని తెలిపింది. అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా ఈ వ్యయాల భారాన్ని మోయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి బస, ఆహారం, పర్యటన రవాణా ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరించిందని వివరణ ఇచ్చింది. ఇందుకుగానూ రూ.38 లక్షలు ఖర్చయ్యిందని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వైకే సిన్హా చెప్పారు.

కాగా ఫిబ్రవరి 24-25, 2020 తేదీల్లో 36 గంటలపాటు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించారు. ఆయన సతీమణి మెలానియా, కూతురు-అల్లుడు ఇవాంకా-జారెడ్ కుష్నర్‌తోపాటు అమెరికా ఉన్నతాధికారులు పలువురు ఉన్నారు. అహ్మదాబాద్, ఆగ్రా, న్యూఢిల్లీల్లో పర్యటించారు.

ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ చేరుకున్న ట్రంప్ అక్కడ 3 గంటలు గడిపారు. 22 కిలోమీటర్ల రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత సబర్మతి ఆశ్రమంలో మహాత్మగాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం కొత్తగా నిర్మించిన మోతేరా క్రికెట్ స్టేడియం‌తో ‘‘నమస్తే ట్రంప్’’ కార్యక్రమంలో ప్రధాని మోడీతోపాటు పాల్గొన్నారు. అదే రోజు తాజ్‌మహాల్ సందర్శన కోసం అహ్మదాబాద్ నుంచి ఆగ్ర చేరుకున్నారు. ఫిబ్రవరి 25న ఢిల్లీలో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.