Begin typing your search above and press return to search.

ఎన్ని వాతలు పెట్టినా.. ఇలాంటి వెన్న పెట్టే సీన్లు మోడీకే సొంతం

By:  Tupaki Desk   |   7 Aug 2021 3:58 AM GMT
ఎన్ని వాతలు పెట్టినా.. ఇలాంటి వెన్న పెట్టే సీన్లు మోడీకే సొంతం
X
అనుకుంటాం కానీ.. భావోద్వేగానికి మించింది ఏముంటుంది? ఒక వ్యక్తి చండశాసుడైతే అవ్వొచ్చు. కానీ.. అలాంటి వ్యక్తి అప్పుడప్పుడు కూసింత ఎమోషనల్ గా వ్యవహిస్తే చాలు.. ఇట్టే కనెక్టు అయిపోతాడు. మాట కరకుగా ఉంటుంది కానీ మనసు మాత్రం వెన్నపూస అంటూ పొగిడేస్తుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో అలాంటి లక్షణాలు కాస్త ఎక్కువే. తాను ఎంత మొండిఘటమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందునా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత బాగా తెలుసు. దేశ రాజకీయాల్ని మరో దిశగా పయనించేలా చేయటమే కాదు.. ఒక ప్రధానమంత్రి ఇలా కూడా ఉంటారన్నట్లుగా ఎన్నో విషయాల్లో తనదైన ముద్రను వేసిన ఆయన్ను తిట్టే వారు తిడుతుంటారు.. పొగిడేవారు పొగిడేస్తుంటారు.

కాకుంటే.. తిట్టే వారు.. తప్పు పట్టే వారు సైతం ఆయనలోని కొన్ని గుణాల్ని మాత్రం పొగడకుండా ఉండలేరు. పాలనా పరంగా ఆయన విధానాలు అందరూ ఆమోదించేలా ఉండకున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం ఆయన స్పందన రోటీన్ కు భిన్నంగా ఉండటమేకాదు.. ఇప్పటివరకు దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారెవరూ చేయని రీతిలో ఉంటాయి.తాజాగా అలాంటి పనే చేసి మనసుల్ని దోచేశారు. ఒలింపిక్ క్రీడల్లో అనూహ్య విజాయాల్ని సొంతం చేసుకున్న భారత మహిళా హాకీ జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకోవటంలో భాగంగా జరిగిన మ్యాచ్ లో హోరాహోరీగా పోరాడి ఓడిన సంగతి తెలిసిందే.

నాలుగు క్వార్టర్ సెషన్లలో నాలుగో సెషన్లో అనూహ్యంగా బ్రిటన్ జట్టు చెలరేగిపోవటం.. వారిని అడ్డుకునేందుకు తమ శక్తి మేర ప్రయత్నించి విఫలమైన రాణిసేనను అందరూ అభినందించారే కానీ.. ఇలా ఎందుకు చేశారన్నది లేదు. కానీ.. ఆ అమ్మాయిలు మాత్రం మ్యాచ్ఓడిన తర్వాత ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఇదంతాచూస్తే.. పతకం సాధించాలన్న పట్టుదల.. కసి వారిలో ఎంత ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. మ్యాచ్ ఓడిన నిరాశలో ఉన్న వారు తీవ్రమైన వేదనలో ఉన్నారు.

ఇలాంటవేళ.. అనూహ్యంగా ప్రధానమంత్రి మోడీ ఫోన్ చేయటం.. వారిని ఊరడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి థ్యాంక్స్ చెబుతూనే.. మరోవైపు క్రీడాకారులు కన్నీళ్లు పెట్టేసుకున్నారు. తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి సమయాన్ని ఎలా డీల్ చేయాలో బాగా తెలిసిన మోడీ.. వారిని ఊరడించారు. తన మాటలతో అనునయించారు. ఆగస్టు 15న మనం కలుస్తున్నామని చెప్పటమే కాదు.. బాధ పడొద్దు.. గర్వపడేలా ఆడారంటూ సాంత్వన వచనాలు పలికారు. ఇదంతా చూస్తున్నప్పుడు మోడీని వ్యతిరేకించేవారు.. ఆయన విధానాల్ని తప్పు పట్టే వారు సైతం ఆయన స్పందించిన తీరును అభినందించకుండా ఉండలేరు.

రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత నుంచి వరుస ఎదురుదెబ్బలు తింటున్న మోడీ సర్కారుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు.. తనదైన మార్కును వేస్తే.. ఇలాంటివి మోడీ మాత్రమే చేయగలరన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రోజువారీగా పెంచేస్తూ పెట్రోల్.. డీజిల్ బాదుడుతో రికార్డు ధరలకు చేరిన వేళ.. సగటుజీవులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు మోడీని వ్యతిరేకించే వారు సైతం.. సమయానికి తగ్గట్లుగా వ్యవహరించి.. గాయపడిన వారి మనసుల్ని వెన్నరాసిన వైనం చూస్తున్నప్పుడు మాత్రం ఆయన్ను అభినందించకుండా ఉండలేని పరిస్థితి. రోజువారీ పెట్రో బాదుడ్ని సైతం మరిచేలా ఈ వెన్నపూత చర్యలు ఉంటాయని చెప్పక తప్పదు. మోడీకి మాత్రమే సాధ్యమయ్యే ఈ తీరే ఆయన బలమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.