Begin typing your search above and press return to search.

మోడీ అన్న అప్పులు చేయొచ్చు.. మ‌రి రాష్ట్రాలు?

By:  Tupaki Desk   |   10 Aug 2021 10:33 AM GMT
మోడీ అన్న అప్పులు చేయొచ్చు.. మ‌రి రాష్ట్రాలు?
X
ఎన్నిక‌లు వ‌చ్చాయంటే చాలు ఉచిత హామీల వ‌ర‌ద పొంగుతోంది. అది చేస్తాం.. ఇవి ఇస్తామంటూ.. ఆచ‌ర‌ణ సాధ్యం కాని ఆర్థికంగానూ డ‌బ్బులు స‌మ‌కూర్చ‌లేని వాగ్ధానాలు నాయ‌కులు చేస్తుంటారు. ఎలాగైనా స‌రే అధికారంలోకి రావ‌డం కోసం పెద్ద ఎత్తున హామీలు ఇస్తారు. ఇటు రాష్ట్రాల్లో.. అటు కేంద్రంలో ఇదే ప‌రిస్థితి. తీరా అధికారంలోకి వ‌చ్చాక సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల‌కు నేరుగా డ‌బ్బులు పంచుతున్నారు. వాళ్లు ఆర్థికంగా ఎదిగే తోడ్పాటు అందించ‌కుండా నేరుగా డ‌బ్బులు పంపిణీ చేయ‌డం ద్వారా దీర్ఘ‌కాలంలో ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఈ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేందుకు అప్పులు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ప్ర‌భుత్వాల‌ది. వ‌చ్చే ఆదాయం త‌క్కువగా.. చేసే అప్పు ఎక్కువ‌గా ఉండ‌డంతో ప్ర‌భుత్వాల మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌వుతోంది. ఇప్పుడిదే అంశంపై అంద‌రూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారు. ఆ రాష్ట్రమే అని కాదు.. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల‌ది అదే ప‌రిస్థిది. కేంద్రంలోని ప్ర‌భుత్వం కూడా భారీగానే అప్పుడు చేస్తోంది.

రాష్ట్రాలు అప్పులు చేస్తే అదేదో నేరంగా ప‌రిగ‌ణించే కేంద్రంలోని ప్ర‌స్తుత బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌ధాని మోడీ చేస్తున్న అప్పుల‌ను మాత్రం ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌దు అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు రావాల్సిన వాటాను ఇవ్వ‌కుండా ఆప‌డం కూడా రాష్ట్రాలు అప్పులు చేయ‌డానికి ఓ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని మేధావులు అంటున్నార‌. ఇటు ఆదాయం రాక‌.. అటు కేంద్రం నుంచి వాటా రాక రాష్ట్రాలు అప్పులు చేయాల్సి వ‌స్తోంది. ఒక‌ప్పుడు అప్పు చేయ‌డానికి ఎవ‌రైనా వెనుకాడేవారు. కానీ ఇప్పుడ‌ది అనివార్య‌మైంది. ప్ర‌భుత్వాలు కూడా అందుకు మిన‌హాయింపేమీ కాదు.

రాష్ట్రాల ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను కొంత‌వ‌ర‌కు నియంత్రించే కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిస్థితి కూడా ఏం బాలేదు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు కూడా అప్పుల మీద అప్పులు చేస్తోంది. 2020-21 తాత్కాలిక లెక్క‌ల ప్ర‌కారం దేశ జీడీపీ రూ.197 ల‌క్ష‌ల కోట్లు కాగా.. అప్పుల భారం రూ.119 ల‌క్ష‌లు కోట్లు కావ‌డం గ‌మ‌నార్హం. ఏడాది కాలంలో కేంద్రం అప్పు 13.85 శాతం పెర‌గ‌డం చూస్తే ఆందోళ‌న క‌లుగుతోంది. ఆదాయానికి, ఖ‌ర్చుల మ‌ధ్య పొంత‌న లేక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో కేంద్రం అప్పులు ఒక కోటీ 4 ల‌క్ష‌ల 99 వేల 460 కోట్లు ఉండ‌గా.. 2020-21కి గాను అవి కోటీ 19 ల‌క్ష‌ల 53 వేల 758 కోట్ల‌కు చేరుకున్నాయి. ఏటా అప్పుల భారం పెర‌గ‌డం త‌ప్ప త‌గ్గించుకోవాల‌నే ధ్యాస పాల‌కుల‌కు లేదు. గ‌త ఎనిమిదేళ్లుగా ఏటా రూ.26,781 కోట్ల చొప్పున కేంద్ర ప్ర‌భుత్వం అప్పులు తీరుస్తోంది.


అప్పుల భారతంగా దేశం పూర్తిగా దిగ‌జారిపోకూడ‌దూ అంటే.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికైనా మేల్కోవాలి. ఉచిత సంక్షేమ ప‌థ‌కాల‌ను ప‌క్క‌కు పెట్టి.. ప్ర‌జ‌ల ఆదాయం పెరిగే మార్గాలు క‌నిపెట్టాలి. ఆ దిశ‌గా వ‌న‌రుల‌ను స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకుని త‌గిన ఫ‌లితం రాబ‌ట్టాలి. ప్ర‌భుత్వాల ఆదాయం పెరిగేలా చూడాలి. కానీ ఇలా ఉచితంగా అన్ని అందిస్తూ ఉంటే చివ‌ర‌కు ఆ అప్పు తీర్చేందుకు ప్ర‌జ‌ల‌నే తాక‌ట్టు పెట్టే ప‌రిస్థితి రావ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయం ఉంది. అలాంటి ప‌రిస్థితి రాకుండా ఉండాలంటే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌ఖ్య‌త‌తో మెలుగుతూ.. ఒక మాట మీద ఉంటూ ఆదాయ మార్గాల‌పై దృష్టి పెట్టాలి. దుబారా ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవాలి. ప్ర‌జా ప్ర‌తినిధుల ఆడంబారాల‌ను క‌ట్ట‌డి చేయాలి.