Begin typing your search above and press return to search.

బ్రిటన్ ప్ర‌ధాని పీఠం.. బోరిస్‌దా.. సునాక్‌దా.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌!!

By:  Tupaki Desk   |   21 Oct 2022 6:01 AM GMT
బ్రిటన్ ప్ర‌ధాని పీఠం.. బోరిస్‌దా.. సునాక్‌దా.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌!!
X
బ్రిట‌న్ ప్ర‌ధాని పీఠంపై ట్విస్టులు నెల‌కొన్నాయి. దేశంలో 45 రోజుల కింద‌ట ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీకరించిన లిజ్ ట్ర‌స్‌.. అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో వచ్చే వారం నాటికి తదుపరి ప్రధానిని ఎన్నుకోవాల్సి ఉంది. దీంతో ఇప్పుడు భారత సంతతికి చెందిన రిషి సునాక్ పై ఆశ‌లు పుంజుకున్నాయి. అయితే.. అదేస‌మ‌యంలో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బ్రిటన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

దీంతో లిజ్‌ ట్రస్‌ తర్వాత బ్రిటన్‌ పగ్గాలు ఎవరు చేపడతారు? ఇప్పటికైనా ఆంగ్లేయులు భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు అవకాశం ఇస్తారా? సమర్థుడైన ఆర్థిక మంత్రిగా పేరొందిన ఆయన పేరును ఆమోదిస్తారా? లేక మరొకరిని ఎంచుకుంటారా అనేది ప్ర‌శ్న‌గా మారింది.వాస్త‌వానికి రుషి సునాక్ రేసులో ముందంజలో ఉన్నారు. అయితే కన్జర్వేటివ్‌ పార్టీలోని అంతర్గత రాజకీయాల కారణంగా ఎవరి పేరైనా అనూహ్యంగా తెరపైకి వచ్చే అవకాశముంది. సునాక్‌తోపాటు మరికొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వారిలో మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ప్రస్తుత ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌, ప్రతినిధుల సభ నేత పెనీ మోర్డౌంట్‌, రక్షణ మంత్రి బెన్‌ వాలెస్ ఉన్నారు. అయితే.. వీరందరిలోనూ సునాక్‌కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని స్థానిక మీడియాలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రస్తుతం బ్రిటన్‌ ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, గతంలో భేషైన ఆర్థిక మంత్రిగా ప్రశంసలు అందుకున్న సునాక్‌ సరైన ఎంపిక కావాలని అంటున్నాయి.

కానీ, సునాక్‌కు ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తన రాజీనామాకు కారణమైన సునాక్‌ను ప్రధానిగా చూడటానికి మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సిద్ధంగా లేరు. మొన్నటి ఎన్నికల్లోనే ట్రస్‌ కంటే తొలుత రేసులో ముందంజలో ఉన్న సునాక్‌కు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు.

సునాక్‌పై కోపంతో ట్రస్‌కు మద్దతిచ్చారు. ఆమె గెలిచేలా చేశారు. తాజాగా మళ్లీ తానే రంగంలోకి దిగాలని ఆశపడుతున్నారు. ఒకవేళ తాను నెగ్గలేని పరిస్థితుల్లో సునాక్‌ను ఓడించటానికే జాన్సన్‌ ప్రయత్నిస్తున్నారు.

బ్రిటన్‌లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2025లో జరుగుతాయి. అప్పటిదాకా మెజార్టీ ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థే ప్రధాని అవుతారు. ట్రస్‌ తర్వాతి ప్రధానిని ఎన్నుకునేది కన్జర్వేటివ్‌ పార్టీయే. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ భవితవ్యానికి ఆ పార్టీ పెద్దపీట వేస్తుందా, లేదా సంకుచిత రాజకీయాలకా అనేది మరో వారంలో తేలిపోతుంది. ఒకవేళ రిషి సునాక్‌ ప్రధానిగా ఎన్నికైతే భారత సంతతి నుంచి ఆ అవకాశం లభించిన తొలి వ్యక్తి అవుతారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.