Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ భవిష్యత్ తేలిపోతుందా ?

By:  Tupaki Desk   |   3 April 2022 7:32 AM GMT
ఇమ్రాన్ భవిష్యత్ తేలిపోతుందా ?
X
దాయాది దేశం ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్ ఈరోజు తేలిపోతుందా ? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పాకిస్తాన్ పార్లమెంట్ లో ఆదివారం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ తర్వాత ఓటింగ్ జరగబోతోంది. అందుబాటులో ఉన్న సమీకరణల ప్రకారం ఇమ్రాన్ ప్రభుత్వంపై వేటు పడటం ఖాయమని అర్థమైపోతోంది. ఎంపీల సంఖ్యాబలం రీత్యా ఇమ్రాన్ పార్టీ మైనార్టీ లో పడిపోయింది.

ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలు ఇమ్రాన్ కు తమ మద్దతు ఉపసంహరించుకున్నాయి. పైగా సొంత పార్టీ లోని 24 మంది ఎంపీలు రాజీనామాలు చేశారు. అలాగే ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు కూడా రాజీనామాలు చేసేశారు. అంటే ఏ కోణంలో చూసినా అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ప్రభుత్వం గెలిచే అవకాశాలు దాదాపు లేవని అర్ధమైపోతోంది. ప్రభుత్వం పడిపోయిన తర్వాత ప్రధాని ఏమి చేస్తారన్నదే కీలకంగా మారింది.

ఇమ్రాన్ ముందున్నది రెండే మార్గాలట. మొదటిదేమో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయటం. రెండోది ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం. ఇమ్రాన్ ఆలోచన ప్రకారం ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకనే నాలుగు రోజుల క్రితం కూడా రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని ఇమ్రాన్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన ప్రభుత్వం ఓడిపోయిందని సాంకేతికంగా తెలియగానే జనాల్లోకి వెళ్ళిపోవాలని ప్రధాని ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు.

తన ప్రభుత్వంపై జరగబోయే అవిశ్వాస తీర్మానం అమెరికా కుట్రగా ఇమ్రాన్ ఆరోపణలు చేయటం రాజకీయ ఆరోపణలే కానీ అందులో హేతుబద్దత కనిపించటంలేదు. తప్పని సరిగా పదవిలో నుడి దిగిపోవాల్సిన ప్రతి ఒక్కరూ చెప్పే మాటలే కాబట్టి ఇమ్రాన్ మాటలను కూడా ఎవరు పట్టించుకోవటం లేదు.

కాకపోతే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నేపథ్యంలో జనాలు రోడ్లపై పోటెత్తాలని ఇమ్రాన్ పిలుపివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. దీనిర్ధమేంటో ఎవరికీ అర్ధం కావడం లేదు. జనాల ద్వారా మిలిటరీ, ప్రతిపక్షాలపై ఇమ్రాన్ తిరుగుబాటు లేవదీయాలని అనుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.