Begin typing your search above and press return to search.

ప్రధాని మోదీ నోట.. బాహుబలి మాట.. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   19 July 2021 9:30 AM GMT
ప్రధాని మోదీ నోట.. బాహుబలి మాట.. ఎందుకంటే ?
X
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సందేశమిచ్చారు. ఆయన తన సందేశంలో టాలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్ హిట్ మూవీ బాహుబలి ప్రస్తావనను తీసుకువచ్చారు. ఈసారి ప్రత్యక్షంగా సమావేశాలు జరుగుతున్నందున ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమైన అంశాలపైనే ప్రధాన చర్చ ఉంటుంది.

అందరూ వ్యాక్సిన్ తప్పకుండా వేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకుంటే బాహుబలిలా మారవచ్చు. సభలో అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన చర్చలు జరగాలి. ప్రతిపక్షాల అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం అని ప్రధాని మోదీ అన్నారు.

గతంలో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో బాహుబలి సినిమా ప్రస్తావనను మోదీ అనేక సార్లు తెచ్చారు. దీంతోపాటు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా వర్షం కురుస్తుండటంతో.. నరేంద్ర మోదీ తన గొడుగు తానే పట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కనీసం ఒక్కడోసు టీకా అయినా తీసుకుని ఉంటారని ఆశిస్తున్నానంటూ మోదీ పేర్కొన్నారు.

ఇప్పటివరకూ 40 కోట్లకుపైగా ప్రజలు బాహుబలులుగా మారారంటూ వ్యాక్సిన్ తీసుకున్న వారి గురించి ప్రస్తావించారు. కరోనా మహమ్మారి కట్టడి చర్యలపై ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడుతున్నానని.. ఈ సమావేశాల్లో కూడా అదే చేయాలనుకుంటున్నానని తెలిపారు.

ఈ పార్లమెంట్‌ సమావేశాలు ఫలవంతంగా సాగాలని, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు లభించాలని ఆశిస్తున్నానంటూ మోదీ పేర్కొన్నారు. విపక్ష సభ్యులు కఠిన ప్రశ్నలు సంధిస్తూ.. సభ సజావుగా సాగేలా సహకరించాలన్నారు. ప్రభుత్వం అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని అన్ని ప్రశ్నలకు జవాబులు లభిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. మహమ్మారిపై పోరుకోసం.. ఫ్లోర్ లీడర్లతో చర్చించాలనుకుంటున్నామని మోదీ తెలిపారు.

కాగా సోమవారం ఉ.11 గంటలకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత నలుగురు కొత్త ఎంపీలతో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో ఇటీవల తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు. కాగా నేటి నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 17 కొత్త బిల్లులతో పాటు 2 ఆర్థిక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.