Begin typing your search above and press return to search.

సామాన్యుడ్ని ప్రేమించిన అగ్ర‌దేశ రాజ‌కుమారి

By:  Tupaki Desk   |   4 Sep 2017 4:59 AM GMT
సామాన్యుడ్ని ప్రేమించిన అగ్ర‌దేశ రాజ‌కుమారి
X
అన‌గ‌న‌గా ఓ రాకుమారి. రాచ‌రికం.. కోట‌లు.. గౌర‌వ మ‌ర్యాద‌లు.. ఇవ‌న్నీ వ‌ద్ద‌నుకొని ఒక సామాన్యుడి ప్రేమ‌లో ప‌డ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ చాలానే రీల్ క‌థ‌ల్లో చూసి ఉంటాం. ఇప్పుడు అలాంటి రీల్‌ కు మించిన రియ‌ల్ ఉదంతం ఒక‌టి అధికారికంగా వెలువ‌డింది.

ప్ర‌పంచ అగ్ర‌దేశాల్లో ఒక‌టైన జ‌పాన్ లో ప‌రిమిత రాచ‌రికం ఉన్న విష‌యం తెలిసిందే. పురుషాధిక్య‌త ఎక్కువ‌గా ఉండే జ‌పాన్ దేశంలో కొన్ని రూల్స్ చాలా చిత్రంగా క‌నిపిస్తాయి. పురుషుల‌కు పెద్ద‌పీట వేస్తూ.. వారికి ప్ర‌త్యేక మిన‌హాయింపులు ఇస్తారు. రాచ‌రిక మ‌హిళ‌ల‌కు మాత్రం అందుకు భిన్నమైన నిబంధ‌న‌లు ఉంటాయి. రాచ‌కుటుంబంలో ఎవ‌రైనా పురుషుడు ఒక సామాన్య మ‌హిళ‌ను ప్రేమించి పెళ్లాడితే.. వారి రాచ‌రిక హోదా ఏ మాత్రం పోదు. కానీ.. అదే రాచ‌రికానికి చెందిన అమ్మాయి ఎవ‌రైనా సామాన్యుడ్ని ప్రేమిస్తే మాత్రం రాచ‌రిక హోదాను పోగొట్టుకోవాల్సి వ‌స్తుంది.

అయితే.. ఈ హోదాల్ని కాద‌ని.. ఒక సామాన్యుడ్ని ప్రేమించి.. పెళ్లాడ‌నున్న ఘ‌ట‌న ఇప్పుడు జ‌పాన్ లో అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. తాను ప్రేమించిన కుర్రాడి కోసం అత్యంత గౌర‌వ‌.. మ‌ర్యాద‌లు ద‌క్కే రాచ‌రిక హోదాను వ‌దిలేసుకోవ‌టానికి సైతం వెనుకాడ‌లేదు. జ‌పాన్ రాజ‌కుమారి ల‌వ్ స్టోరీ ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్సిస్తోంది.

ఒక సామాన్యుడ్ని ఆమె పెళ్లాడ‌నున్న విష‌యాన్నివెల్ల‌డిస్తూ రాజ‌కుటుంబం ఒక అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. రాజ‌కుమారి మాకో.. టీవీ కార్య‌క్ర‌మాల్లో త‌ర‌చూ క‌నిపించే 25 ఏళ్ల కీ కుమురోను ప్రేమించిన విష‌యాన్ని వెల్ల‌డించ‌టంతో పాటు వారి వివాహం 2018లో జ‌ర‌గ‌నున్న‌ట్లుగా పేర్కొంది. వీరి వివాహం త‌ర్వాత ఆమె త‌న రాచ‌కుటుంబ హోదాను వ‌దులుకోవాల్సి ఉంటుంది.

జ‌పాన్ చ‌క్ర‌వ‌ర్తి అకిహితో కుమారులు ఇద్ద‌రూ సామాన్య మ‌హిళ‌ల్నే పెళ్లి చేసుకోవ‌టం ఒక విశేషం అయితే.. చ‌క్ర‌వ‌ర్తి అకిహితో పెద్ద మ‌న‌మ‌రాలు అయిన మాకీ సైతం సామాన్యుడి ప్రేమ‌లో ప‌డింది. పెళ్లితో త‌న రాచ‌కుటుంబ హోదాను పోగొట్టుకోవ‌టంపై ఎలాంటి బాధ లేద‌ని ఆమె ప్ర‌క‌టించారు. ప‌ర్యాట‌క ప్ర‌చారం నిమిత్తం నిర్వ‌హించిన పోటీలో కీ కుమురో ప్రిన్స్ ఆప్ ది సీ కిరీటాన్ని గెలుచుకున్నారు. మూడేళ్ల క్రితం యువ‌రాణిపై త‌న‌కున్న ప్రేమ‌ను వెల్ల‌డించాడు.

దీనికి ఆమె కూడా ఓకే అన‌టంతో వారి ప్రేమ ప్ర‌యాణం మొద‌లైంది. ఒక‌రినొక‌రు ప్రేమ‌గా పొగిడేసుకునే వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. చ‌ల్ల‌ని చంద్రుడ‌ని యువ‌రాణిని కుమురో అభివ‌ర్ణిస్తుంటే.. అత‌గాడి న‌వ్వు సూర్య‌కాంతిలా ఉంటుంద‌ని యువ‌రాణి సిగ్గుగా చెప్పేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఆదివారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో త‌మ పెళ్లి గురించి అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు యువ‌రాణి. రీల్ ను త‌ల‌పించేలా ఉన్న ఈ రియ‌ల్ ల‌వ్ స్టోరీ ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.