Begin typing your search above and press return to search.

హెల్త్‌ వాలంటీర్‌ గా మారిన స్వీడన్‌ యువరాణి..ఎందుకంటే?

By:  Tupaki Desk   |   17 April 2020 7:10 AM GMT
హెల్త్‌ వాలంటీర్‌ గా మారిన స్వీడన్‌ యువరాణి..ఎందుకంటే?
X
కరోనా మహమ్మారి పై ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బందికి సాయం అందించేందుకు స్వీడన్‌ యువరాణి - ప్రిన్స్‌ కార్ల్‌ ఫిలిప్‌ భార్య సోఫియా ముందుకు వచ్చి, మూడు రోజుల ఇంటెన్సివ్‌ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసి వాలంటీర్‌ గా మారారు. తాను గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోఫియామెట్‌ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె నేరుగా కరోనా పేషెంట్లకు సేవలు అందించారు గానీ వైద్య సిబ్బందికి సహాయకురాలిగా ఉంటారని ది రాయల్‌ సెంట్రల్‌ వెల్లడించింది.

ఈ మేరకు... ఈ సంక్షోభంలో యువరాణి తన వంతు బాధ్యతగా వాలంటరీ వర్కర్‌ గా సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. వైద్య సిబ్బందిని అధిక భారం నుంచి విముక్తి చేయాలని భావించారు అని రాయల్‌ కోర్టు ప్రతినిధి వెల్లడించినట్లు తెలిపింది. కాగా సోఫియామెట్‌ ఆస్పత్రి వైద్యేతర సిబ్బందికి ఆన్‌ లైన్‌ లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైద్య సిబ్బందిపై అధిక భారం పడకుండా క్లీనింగ్‌ - వంట చేయడం తదితర పనుల్లో శిక్షణ ఇస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటి వరకు 80 మంది సోఫియామెట్‌ ఆస్పత్రి లో సేవలు అందిస్తున్నారు. తాజాగా యువరాణి సోఫియా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. ఇక నీలం రంగు ఆప్రాన్‌ ధరించిన సోఫియా ఫొటోలు రాయల్స్‌ ఆఫ్‌ స్వీడన్‌ ఇన్‌ స్టా పేజ్‌ లో షేర్‌ చేయగా.. ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా స్వీడన్‌ లో ఇప్పటి వరకు 1300 కు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏమైనా కూడా ఒక యువరాణి కూడా ఈ ఆపద సమయంలో నేనున్నా అంటూ ముందుకు రావడం శుభపరిణామం.