Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల గుండెలు మండేలా చేసిన పేపర్లు

By:  Tupaki Desk   |   27 Jan 2017 7:18 AM GMT
ఆంధ్రోళ్ల గుండెలు మండేలా చేసిన పేపర్లు
X
తెలుగు మీడియాలో పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. ఏదైనా ఒక పెద్ద పరిణామం చోటు చేసుకున్నా.. ఘటన జరిగినా.. తర్వాతి రోజున వచ్చే వార్తాపత్రికలు ప్రాధాన్యతను ఇస్తుంటాయి. కానీ.. తెలుగు దినపత్రికల తీరు ఇందుకు భిన్నంగా మారింది. నిన్నటి రోజున అంటే జనవరి 26న ఏపీలోని వార్తా ఛానళ్లను రోజంతా చూసినోళ్లకు.. విశాఖలో తలపెట్టిన శాంతి ధర్నాను హైలెట్ చేస్తూ ప్రముఖంగా చూపించటం జరిగింది. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. ఏపీ సర్కారు పుణ్యమా అని.. విశాఖ నగరం మొత్తాన్ని పోలీసుల్ని పెట్టేసి.. నిరసన ప్రదర్శనలు జరగకుండా అడ్డుకోవటంలో పోలీసులు డబుల్ సక్సెస్ అయ్యారు.

ఆ ఛానల్.. ఈ ఛానల్ అన్న తేడా లేకుండా అన్ని ఛానళ్ల వారు చూపించిన దాని ప్రకారం.. విశాఖలో కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉందన్నది నిజం. అదే విషయాన్ని అన్ని ఛానళ్లు చెప్పేశాయి. అదేం సిత్రమో కానీ.. ఈ రోజు తెల్లవారిన తర్వాత ఇళ్లకు వచ్చిన పేపర్లను చూస్తే నోట మాట రాని పరిస్థితి. తెలుగులో ప్రధాన దినపత్రికలు అయిన మూడింటిలో విశాఖలో జరిగిన వార్తకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే నోట మాట రాని పరిస్థితి. జగన్ ఎయిర్ పోర్ట్ ఎపిసోడ్ ను ఒకలా చూపించేసి.. దానికి కౌంటర్ గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన మీడియా సమవేశానికి అధికార ప్రాధాన్యత ఇచ్చిన వైనం కనిపిస్తుంది.

ఇక.. నిరసనకు సంబంధించిన వార్తను చూస్తే.. కర్ర విరగకుండా.. పాముచావని రీతిలో హెడ్డింగ్ పెట్టేసి.. మమ అనిపించిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన పత్రికలైన మూడింటిలో రెండింటి పరిస్థితి ఇదేలా ఉండటం కనిపిస్తుంది. కోట్లాది ప్రజల ఆకాంక్షలు తమకు పట్టవన్నట్లుగా తెలుగు దినపత్రికలు వ్యవహరించాయన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది. ఛానళ్లలో నిజాన్ని గంటల కొద్దీ లైవ్ చూసేసిన తర్వాత.. పేపర్లలో దాన్ని ఆచితూచి ఇస్తూ..ప్రాధాన్యత పెద్దగా ఇవ్వని వైనం చూసినప్పుడు.. ఏపీకి హోదా వచ్చే విషయంలో ఏపీకి చెందిన ప్రధాన పత్రికలకు పెద్దగా ఇష్టం లేదన్న భావన కలుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటివి వ్యాపారం చేసుకునే దినపత్రికలకు అంత మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనాభిప్రాయం ప్రతిబింబించని పత్రికల్ని ప్రజలు అట్టే కాలం ఆదరించరన్న విషయం వాటి యాజమాన్యాలకు తెలీవా..? లేక.. మర్చిపోయారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/