Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో ఖైదీల పాలిట వరంగా మారిన కరోనా

By:  Tupaki Desk   |   12 May 2020 11:30 AM GMT
మహారాష్ట్రలో ఖైదీల పాలిట వరంగా మారిన కరోనా
X
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా భారత్ లో వరుసగా మూడు లాక్ డౌన్ లు విధించిన సంగతి తెలిసిందే. ఓ పక్క లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోన్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడం కలవరపెడుతోంది. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా కలిగిన మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో 23 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా....కరోనా బారిన పడి 868 మంది మరణించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవిలో కరోనా ప్రబలడంతో ఉధ్దవ్ సర్కార్ ఉలిక్కిపడింది. అయితే, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ధారవిలో పరిస్థితి చేయి దాటలేదు. ఇదిలా ఉండగా, ధారవి తరహాలోనే ముంబైలో జనసాంద్రత అత్యధికంగా ఉండే ఆర్ధర్ రోడ్ సెంట్రల్ జైల్ లో 184 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మహా సర్కార్ ఉలిక్కిపడింది.

ఈ నేపథ్యంలోనే ఉధ్దవ్ థాకరే ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మిగతా ఖైదీలకు కరోనా సోకకుండా ఉండేందుకు జైళ్లలోని సగం మంది ఖైదీలను విడుదల చేయాలని ఓ అత్యున్నత నిర్ణాయక కమిటీ తీర్మానించింది. దాదాపు 35,239 మంది ఖైదీలను మధ్యంతర బెయిలు లేదా పెరోల్ పై బయటికి పంపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆ 35 వేల మంది ఖైదీలకు 'కరోనా' బెయిలిచ్చింది. అయితే, ఏ కేటగిరీ కింద ఖైదీలను ఎప్పటిలోపు విడుదల చేస్తారు? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఖైదీలకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయపరంగా తగిన విధానాలు అనుసరిస్తామని జస్టిస్ ఏఏ సయీద్ ఆధ్వర్యంలోని ఈ కమిటీ వెల్లడించింది. ఈ కమిటీలో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ చహండే, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ పాండే సభ్యులుగా ఉన్నారు. న్యాయబద్ధంగా విధివిధానాలను పాటిస్తేనే బెయిల్ ఇవ్వడం సాధ్యపడుతుందని, న్యాయపరమైన అన్నినిబంధనలకు లోబడే ఖైదీలను బెయిల్ పై బయటికి పంపుతామని ఎస్ఎన్ పాండే తెలిపారు. కరోనా దెబ్బకు ఇప్పటికే పలు దేశాల్లోని జైళ్లలో ఖైదీలను బెయిల్, పెరోల్ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.