Begin typing your search above and press return to search.

ప్రథ్వీ షా.. రంజీల్లో ట్రిపుల్.. కొద్దిలో రికార్డు మిస్

By:  Tupaki Desk   |   11 Jan 2023 9:02 AM GMT
ప్రథ్వీ షా.. రంజీల్లో ట్రిపుల్.. కొద్దిలో రికార్డు మిస్
X
అది 2018 అండర్-19 ప్రపంచ కప్. అప్పటికే ఆ కుర్రాడు స్కూల్ స్థాయిలో అదరగొట్టాడు. సెంచరీల మీద సెంచరీలతో రంజీల్లోనూ రాణించాడు. ప్రపంచ కప్ లోనూ మెరిశాడు. దీంతో వెంటనే టీమిండియాలోకి పిలుపువచ్చింది. వస్తూనే సెంచరీ బాదేశాడు. మంచి నీళ్ల ప్రాయంలా మూడంకెల స్కోరు చేసే అతడిని చూసి ఇక అంతా తిరుగులేదనుకున్నారు. కానీ, కాలం తిరగబడింది. తొలుత గాయం, ఆ తర్వాత ఫిట్ నెస్, ఆపై ఫామ్ ఇలా అన్నీ ఒక్కోటిగా దెబ్బకొట్టగాయి. ఫలితంగా అతడి కెరీర్ మసకబారింది. అండర్ 19 ప్రపంచ కప్ లో తనతో ఆడిన శుబ్ మన్ గిల్ టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించుకుంటే, అతడు మాత్రం రంజీల్లో ఆపసోపాలు పడుతున్నాడు. ఏదైనా అసాధారణం చేస్తే తప్ప టీమిండియా గడప తొక్కే చాన్సు లేని పరిస్థితుల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

అతడు ఎవరంటే..?

ముంబై క్రికెటర్ ప్రథ్వీ షా రంజీల్లో రెండో అత్యధిక స్కోరు సాధించాడు. అసోంతో జరుగుతున్న మ్యాచ్ లో 383 బంతుల్లో 379 పరుగులు చేశఆడు. ఇందులో 49 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు 400 పరుగులు చేస్తాడని అనిపించింది. కానీ, రియాన్ పరాగ్ బౌలింగ్ లో ఎల్బీ అయ్యాడు. కాగా, రంజీల్లో ప్రథ్వీ షా చేసిన పరుగులు రెండో అత్యధికం. వాస్తవానికి ఈ సీజన్ లో షా ఫామ్ బాగోలేదు. గత ఐదు మ్యాచ్ ల్లో 8 ఇన్నింగ్స్ లు ఆడి అతడు చేసింది ఒకటే అర్ధ సెంచరీ. ఆ లోటును అసోంతో మ్యాచ్ లో భర్తీ చేశాడు. 240 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బుధవారం బ్యాటింగ్ కొనసాగించిన షా.. మరో 99 బంతులు ఆడి 139 పరుగులు చేశాడు.

75 ఏళ్లుగా అతడిదే రికార్డు

రంజీట్రోఫీలో అత్యధిక స్కోరు మహారాష్ట్రకు చెందిన బాబూసాహెబ్ నింబాల్కర్ (443) పేరిట ఉంది. అతడు 1948లో ఈ పరుగులు చేశాడు. కతియవార్ జట్టుపై ఆడుతూ ఈ స్కోరు చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డు అతడి పేరిటే ఉంది. కాగా, తాజా ఇన్నింగ్స్ తో బాబూసాహెబ్ తర్వాత షా రెండో స్థానంలో నిలవడంతో పాటు మరికొన్ని రికార్డులనూ చెరిపేశాడు.

స్వప్నిల్ గుగాలే (351 నాటౌట్), చతేశ్వర్ పుజారా (352), వీవీఎస్ లక్ష్మణ్ (353), సమిత్ గోహెల్ (359 నాటౌట్), విజయ్ మర్చంట్ (359 నాటౌట్), ఎంవీ శ్రీధర్ (366), సంజయ్ మంజ్రేకర్ (377) తదితరుల తర్వాత 350 మార్క్ దాటిన క్రికెటర్ గా నిలిచాడు. అయితే, వీరందరి కంటే ఎక్కువే పరుగులు చేసిన షా.. టాప్ 2 బ్యాటర్ గా రికార్డులకెక్కాడు.

టీమిండియా పిలుపొస్తుందా..?

అండర్ 19 ప్రపంచ కప్ లో కెప్టెన్ గా చేసి.. యువ టీమిండియాను విజేతగా నిలిపిన షా సీనియర్ జట్టుకు దూరమై మూడేళ్లు అవుతోంది. మధ్యలో వచ్చి పోయినా అది పెద్ద లెక్కలోకి రాదు. మరోవైపు అతడి సహచరుడు శుబ్ మన్ గిల్ మూడు ఫార్మాట్లలోనూ ఓపెనర్ గా వస్తున్నాడు. దీంతో షా కెరీర్ పై కొంత అసహనానికి గురైనట్లు ఇటీవల కనిపించింది. తనను ఎంపిక చేయకపోవడంపై ఇటీవల సెలక్టర్లను తప్పుబట్టాడు. అయితే, తాజా ప్రదర్శనతో అయినా అతడికి అవకాశం దక్కుతుందా? అనేది చూడాలి.

300 కొట్టిన హైదరాబాదీలు ఇద్దరు

రంజీల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన క్రికెటర్లలో హైదరాబాదీలు ఇద్దరు ఉన్నారు. వీవీఎస్ లక్ష్మణ్, ఎంవీ శ్రీధర్ ఈ రికార్డును అందుకున్నారు. వీరిలో లక్ష్మణ్ అంతర్జాతీయ కెరీర్ దిగ్విజయంగా సాగింది. వందపైగా టెస్టులు ఆడాడు. కానీ, ఎంవీ శ్రీధర్ కు ఆ అవకాశం దక్కలేదు. నాలుగేళ్ల కిందట అతడు హైదరాబాద్ లో అకస్మాత్తుగా కన్నుమూశాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.