Begin typing your search above and press return to search.

ఉద్యమ ప్రభుత్వంలో ఈ వార్నింగ్ లు ఏంది సోమేశా?

By:  Tupaki Desk   |   4 Oct 2019 12:16 PM GMT
ఉద్యమ ప్రభుత్వంలో ఈ వార్నింగ్ లు ఏంది సోమేశా?
X
తెలంగాణలో ఉన్నది అలాంటి ఇలాంటి ప్రభుత్వం కాదు. ఉద్యమాలు చేసి.. వరుస పోరాటాలు.. ఆందోనలు.. సమ్మెలు చేసి తమ సుదీర్ఘకాల కోర్కె అయిన తెలంగాణ స్వప్నాన్ని తీర్చుకున్నారు. తమదైన ప్రభుత్వంలో కష్టాల్లేని తెలంగాణ.. ఉద్యమాలు అవసరం లేని తెలంగాణను తాము తయారు చేస్తామన్న నమ్మబలికారు. వరుస పెట్టి రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ ప్రభుత్వం.. తన ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ మర్చిపోయి.. ఉద్యమాలు.. ఆందోళనలు చేసే వారి విషయం కఠినంగా వ్యవహరిస్తుందన్న విమర్శ ఎప్పటినుంచో ఉన్నదే.

తాజాగా ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చిన సమ్మె విషయంలో.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఘాటు వార్నింగ్ ఇచ్చేశారు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. ఆర్టీసీ కార్మిక సంఘాలతో తాము సుదీర్ఘంగా చర్చలు జరిపామని.. సమ్మె నివారణకు చర్యలన్నీ తీసుకున్నామని.. అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాల్ని ధిక్కరించి సమ్మెకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

సమ్మె కొనసాగితే ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్న సోమేశ్.. అవసరమైతే అద్దె.. ప్రైవేటు బస్సులు నడుపుతామన్నారు. దసరా పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయొద్దని తాము చెప్పామని.. అవసరమైతే స్కూల్ బస్సులు నడుపుతామని.. ప్రభుత్వ ఆదేశాల్ని ధిక్కరించిన వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని కూడా తేల్చి చెప్పారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన వారిని విధుల నుంచి తొలగించి.. వారి స్థానే వీలైనంత త్వరగా కొత్తవారిని నియమిస్తామన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ.3003 కోట్ల సాయం అందిందని.. అలాంటిది ప్రభుత్వంపై చెడు అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. ఒకప్పుడు ఆందోళనలతో తమ చిరకాల డిమాండ్ ను సాధించుకున్న రాజకీయ పార్టీ చేతిలో అధికారం ఉన్న వేళ.. ఆందోళనలు చేస్తామన్న వారిపై ఇంత తీవ్రస్థాయిలో చర్యల వార్నింగా? అన్నది ప్రశ్న. ఉద్యమ పార్టీ కావొచ్చు.. మరే బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న పార్టీ కావొచ్చు.. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎవరైనా ఒకేలా వ్యవహరిస్తారన్న విషయాన్ని సారు సర్కారు స్పష్టం చేసిందని చెప్పక తప్పదు.