Begin typing your search above and press return to search.

ఉద్యోగాలేమో కానీ..కంపెనీలకు కొత్త వణుకు

By:  Tupaki Desk   |   1 Sep 2015 4:42 AM GMT
ఉద్యోగాలేమో కానీ..కంపెనీలకు కొత్త వణుకు
X
తెలంగాణ రాష్ట్రంలో ఒక చిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. రాష్ట్ర విభజనకు నిధులు.. నీళ్లు.. నియమకాలే కారణం. ఈ అంశాల్లో జరిగిన అన్యాయంపై పోరాడి చివరకు తెలుగు గడ్డ రెండు ముక్కలు అయ్యిపోయిన విషయంలో అందరికి తెలిసిన విషయమే. నిధులు.. నీళ్లను పక్కన పెడితే.. నియమకాల విషయాన్ని చూస్తే.. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ వారికి జరుగుతున్న అన్యాయంపై గళం విప్పటం.. దానికి తెలంగాణ సమాజం స్పందించటం.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇదో కీలకమైన మలుపుగా మారటం చరిత్ర అయితే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల్ని రిక్రూట్ చేసుకుంటామని చెప్పిన టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాను గతంలో చెప్పినట్లుగానే ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు.

నోటిఫికేషన్ జారీలో ఆలస్యం జరిగినా.. ఎట్టకేలకు నియమకాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయన్నట్లుగా పరిణామాలు వేగంగా సాగిపోతున్నాయి. నెల కిందట నోటిఫికేషన్ రాగా.. తాజాగా అందుకు సంబంధించిన సిలబస్ కూడా వచ్చేసింది. ఇక.. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి.. ఏం చదవాలి? ఎలా చదవాలి? ఎలా ఉద్యోగాన్ని సాధించాలన్న అంశాల మీదనే ఫోకస్ చేసే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోని యువత ఇప్పుడో పెద్ద సందిగ్థతలో పడింది. ఊరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవటం వారికి సుతారమూ ఇష్టం లేదు. మరోవైపు..ఇప్పటికే చేస్తున్న ఉద్యోగాల్ని వదులుకోవటం నచ్చటం లేదు.

ప్రైవేటు.. ప్రభుత్వ రంగాలకు చెందిన వేలాది మంది తెలంగాణ యువకులు.. తామిప్పుడు చేస్తున్న ఉద్యోగాల్ని పక్కన పెట్టేసి.. పోటీ పరీక్షల బరిలోకి నిలుస్తున్నారు. తాము ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాల కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైన ఉద్యోగాల్ని చేజిక్కించుకోవాలన్న అత్రుతలో ఉన్నారు. ఇలాంటి అవకాశం తరచూ రాదని.. వచ్చిన సమయంలో చేజార్చుకోకూడదని భావిస్తున్న వారు.. ఇప్పటికే తాము చేస్తున్న ఉద్యోగాలకు లాంగ్ లీవ్ తీసుకునే వారు కొందరైతే.. మరికొందరు ఉద్యోగాలకు రిజైన్ చేస్తున్నారు.

దీనికి తోడు ఉద్యోగ నియమకాల్లో ఇచ్చిన మార్గదర్శకాల్లో వయో పరిమితిని గరిష్ఠంగా పెంచేయటంతో చాలా ఎక్కువ మంది ఉద్యోగాల కోసం ప్రయత్నించాలన్న ఆశ కలిగేలా చేసింది. దీంతో.. హైదరాబాద్ లాంటి మహానగరంలో చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. చాలా ప్రైవేటు కంపెనీలు.. తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటికే తమ వద్ద పని చేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగుల్లో 60 శాతానికి మించి సర్కారీ కొలువుల కోసం సీరియస్ గా ప్రయత్నించటం.. ఇందుకోసం లాంగ్ లీవ్.. లేదంటే ఉద్యోగం మానేసే ప్రయత్నంలో ఉండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. గతంలో అయితే.. కంపెనీల్లో ఆంధ్రా.. తెలంగాణ అన్న లెక్కలు పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఇప్పుడు అందుకు బిన్నమైన పరిస్థితి.

సరే.. రిజైన్ చేసే వారి స్థానంలో వేరే ప్రాంతానికి చెందిన వారిని నియమించుకోవాలని డిసైడ్ అయితే.. రేపొద్దున తెలంగాణ వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదన్న మాట వస్తుందని.. అదే జరిగితే తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వాపోతున్నారు. ఇంకోవైపు.. లాంగ్ లీవులు పెట్టే వారి పుణ్యమా అని పని ఒత్తిడి.. మిగిలిన ఉద్యోగులపై పెద్ద ఎత్తున ఉందని చెబుతున్నారు. అలాంటి వారి విషయంలో ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు గతంలో మాదిరి కరకుగా వ్యవహరించలేకపోతున్న పరిస్థితి.

ఉద్యోగంలో కంటిన్యూ అవుతారో.. లేదో తెలీటం లేదని.. లాంగ్ లీవ్ కు నో చెబితే ఇబ్బందులు ఎదురవుతాయేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా సర్కారీ కొలువుల నోటిఫికేషన్ సంగతేమో కానీ.. ప్రైవేట్ కంపెనీలకు మాత్రం కొత్త కష్టం వచ్చిందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకదాని తర్వాత మరొకటి చొప్పున నోటిఫికేషన్ల జారీ కోలాహలం కొద్ది నెలల పాటు ఉన్న నేపథ్యంలో.. హైదరాబాద్ లోని ప్రైవేటు కొలువులకు తెలంగాణేతర వారికే ప్రాధాన్యత ఇస్తే.. మంచిదన్న అభిప్రాయం వ్యక్తమువుతోంది. తెలంగాణ వారిని ఎంపిక చేసుకుంటే.. ఉద్యోగంలోకి వచ్చిన ఆర్నెలు.. ఏడాదికే ప్రభుత్వ కొలువుల వైపు దృష్టి పెడుతున్నారన్న మాట పలు ప్రైవేటు కంపెనీల మానవవనరుల విభాగం చెబుతోంది. మొత్తంగా సర్కారీ కొలువుల సందడి.. ప్రైవేటు కంపెనీలకు కొత్త కష్టాన్ని తీసుకొచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.