Begin typing your search above and press return to search.

ఏపీ కీలక నిర్ణయం: కరోనా కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి

By:  Tupaki Desk   |   7 April 2020 8:31 AM GMT
ఏపీ కీలక నిర్ణయం: కరోనా కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి
X
కరోనా వైరస్‌ నివారణకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ వైరస్‌పై నిరంతరం సమీక్షలు చేస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ అప్రమత్తంగా ఉన్నారు. ఆ క్రమంలోనే నిరంతరం వైద్య సేవలు అందించేలా వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు ఇతర శాఖల ఉద్యోగులను ఎస్మా పరిధిలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్న వారికి వైద్యం అందిస్తే రూ.10,774 చెల్లిస్తారు. దీంతో పాటు వైద్యులకు పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కింద రూ.5,631 చెల్లిస్తారు. ఈ క్రమంలో మొత్తం రూ.16,405 ఆస్పత్రులకు చెల్లించేందుకు నిర్ణయించారు. ఇక వైరస్‌ సోకిందని నిర్ధారణ అయి వారికి వైద్యం అందిస్తే రూ.65 వేల నుంచి రూ. 2.15 లక్షల వరకు అందించనున్నారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తీసుకువచ్చారు. వీటితో పాటు మందులు, చికిత్సపై కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. మొత్తం కరోనా వైరస్‌ రాష్ట్రం నుంచి వెళ్లగొట్టేలా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలుచేస్తున్నారు. నిరంతరం వైద్యారోగ్య శాఖతో పాటు పోలీసులు, అత్యావసర సేవలపై సమీక్ష చేస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈక్రమంలో కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా అభినందనలు వెలువెత్తుతున్నాయి.

కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడేందుకు.. లాక్‌డౌన్‌ అమలవుతున్న సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా తీసుకుంటున్న చర్యలపై యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఆర్టీఐ క్యాంపెయిన్ అభినందించింది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చొరవ.. నిరంతర పర్యవేక్షణ పై లేఖలో ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు భూపతిరాజు రామకృష్ణంరాజు, కన్వీనర్లు బుద్దా చక్రధర్, ఇమాన్యుయల్, శ్రీనివాసగౌడ్, చలపతి తదితరులు కొనియాడారు. ఇదే స్ఫూర్తితో చర్యలు తీసుకుని కరోనా నివారణకు కృషి చేయాలని కోరారు.