Begin typing your search above and press return to search.

కేసీఆర్ సాబ్‌...ఇంకో కొత్త స‌మ‌స్య

By:  Tupaki Desk   |   20 Jun 2016 9:59 AM GMT
కేసీఆర్ సాబ్‌...ఇంకో కొత్త స‌మ‌స్య
X
కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల భారంతో ఇప్ప‌టికే స‌త‌మ‌తం అవుతున్న త‌ల్లిదండ్రుల‌కు కొత్త స‌మ‌స్య ఎదురయింది. నిన్నమొన్నటి వరకు పుస్తకాలు - యూనిఫామ్స్‌ వ్యాపారం చేసిన కొర్పొరేట్‌ విద్యాసంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారామని నిరూపించుకుంటున్నాయి. ఈ-లెర్నింగ్‌ పేరుతో కొత్తగా 'ట్యాబ్‌'ల వ్యాపారాన్ని ప్రారంభించాయి. అన్ని వస్తువులతో పాటు 'ట్యాబ్‌'లు కొనాల్సిందేనని యాజమాన్యాలు హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంగానీ - విద్యాశాఖాధికారులు గానీ స్పందించకపోవడం గమనార్హం. విద్యా వ్యవస్థను సంస్కరిస్తానని చెప్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సమస్యపై సైతం తప్పకుండా దృష్టిపెట్టాలని కోరుతున్నారు.

రాష్ట్రంలో 11,470 ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. అత్యధిక పాఠశాలల్లో పుస్తకాలు - యూనిఫామ్స్‌ - ష్యూస్‌.. ఇలా విద్యార్థికి అవసరమైన అన్ని వస్తువులు ఆయా పాఠశాలల ఆవరణలోనే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదంతా విద్యాహక్కు నిబంధనలకు విరుద్ధమైనా పట్టించుకునే వారే కరువయ్యారు. పాఠశాల విద్య కమిషనర్ ఇలాంటి వ్యాపారాలు చేసే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డీఈఓలకు ఆదేశాలు ఇచ్చినా అవి బుట్టదాఖలయ్యాయి. ప్రభుతం ఈ వ్యాపారాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో యాజమాన్యాలు వారి వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటున్నాయి. ఈ విద్యాసంవత్సరం కొత్తగా 'ట్యాబ్‌'ల వ్యాపారాన్ని కార్పొరేట్‌ పాఠశాలలు మొదలుపెట్టాయి. పాఠశాలల్లో పుస్తకాలు - దుస్తులతో పాటు తప్పనిసరిగా దీన్ని కొనాల్సిందేనని యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో మూడు నుంచి ఆరోతరగతి వరకు వీటిని ఉపయోగిస్తుండగా, మరికొన్ని పాఠశాలలు పదో తరగతి వరకూ వాడుతున్నాయి. కార్పొరేట్‌ పాఠశాలల్లో ప్రస్తుతం ఒక్కో ట్యాబ్‌ ను రూ.10వేలకు అమ్ముతున్నాయి. ఇవే బయట మార్కెట్ లో రూ.ఐదు వేల లోపే ఉంటాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. పుస్తకాలు, ట్యాబ్‌ కు కలిపి రూ.15వేలను వసూలు చేస్తున్నాయని వాపోతున్నారు.

ట్యాబ్‌ వద్దని పుస్తకాలు మాత్రమే ఇవ్వాలని కోరుతున్నా, అది కొంటేనే పుస్తకాలు ఇస్తామని చెబుతున్నాయి. బయట మార్కెట్‌ లో కొనుగోలు చేసిన వాటినీ వీరు అనుమతించడం లేదు. ట్యాబ్‌ ల్లో ప్రత్యేక యాప్స్‌ ద్వారా విద్యాబోధన చేస్తామని పాఠశాలల నిర్వాహకులు చెబుతున్నారు. ఇకనుంచి హోమ్‌ వర్క్‌, పరీక్షలను ట్యాబ్‌ ద్వారానే నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్‌ రేట్‌ కు రెండింతల ధరను నిర్ణయించి అమ్మడం సరికాదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పుస్తకాలు - నోట్‌ బుక్స్‌ - దుస్తులు ఇలా అన్ని వ్యాపారాలు కార్పొరేట్‌ పాఠశాలల్లో యథేచ్ఛగా కొనసాగుతున్నా విద్యాశాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యావ్యవస్థను సంస్కరిచే పనిని నెత్తికెత్తుకున్న కేసీఆర్ త‌క్ష‌ణం దృష్టి పెట్టాల్సింది దీనిపైనే అంటున్నారు.