Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా అడిగితే నోటీసులా?

By:  Tupaki Desk   |   18 Oct 2016 10:06 AM GMT
ప్రత్యేక హోదా అడిగితే నోటీసులా?
X
ఏపీలో విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై గళం విప్పినందుకు 12మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 25 - 26 తేదీల్లో ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి ఆ నోటీసుల్లో ఆదేశించారు. మొన్నటి వర్షాకాల సమావేశాల్లో వైసీపీ సభ్యులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ అసెంబ్లీలో తమ గళం వినిపించారు. దీంతో ప్రత్యేక హోదా కోరడమే తాము చేసిన తప్పా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఒక్కోరోజు ఆరుగురు ఎమ్మెల్యేలు కమిటీ ముందు హాజరై - తమ ప్రవర్తన పట్ల వివరణ ఇవ్వాలంటూ తాజా నోటీసుల్లో సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు - కిలివేటి సంజీవయ్య - పాశం సునీల్ కుమార్ - ముత్యాలనాయుడు - ఆళ్ల రామకృష్ణారెడ్డి - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి - దాడిశెట్టి రాజయ్య - కొరుముట్ల శ్రీనివాసులు - చెర్ల జగ్గిరెడ్డి - రాచమల్లు శివప్రసాద్ రెడ్డి - కొడాలి నాని - పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు నోటీసులు జారీ అయ్యాయి.

కాగా తాజా పరిణామాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇవ్వడంపై ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ ఎమ్మెల్యేలు ఏం నేరం చేశారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేకహోదా కోసం సభను స్తంభింపజేయడమే తాము చేసిన నేరమా? అని అడిగారు. 12 మంది ఎమ్మెల్యేలనే కాదు... మొత్తం ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినా, తమ పోరాటం ఆగదని అన్నారు. వైసీపీ తరపున గెలిచి - టీడీపీలో చేరిపోయిన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించాలని తాము కోరుతున్నా, ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని..కానీ ప్రత్యేక హోదా అడిగినందుకు మాత్రం నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ప్రివిలేజ్ కమిటీలో జ్యోతుల నెహ్రూ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించామని... అయినప్పటికీ, నెహ్రూనే కొనసాగిస్తున్నారని ఆయనే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/