Begin typing your search above and press return to search.

చేతులు కాలాక‌.. వెన‌క్కి త‌గ్గిన ప్రియాంక‌!

By:  Tupaki Desk   |   23 Jan 2022 1:30 AM GMT
చేతులు కాలాక‌.. వెన‌క్కి త‌గ్గిన ప్రియాంక‌!
X
కాంగ్రెస్ పార్టీలో ఉద్దేశ పూర్వ‌క త‌ప్పులు ఇంకా జ‌రుగుతూనే ఉన్నాయా? వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగాల్సిన కీల‌క నేత‌లు.. త‌ప్పులపై త‌ప్పులు చేస్తూ.. చేతులు క‌ల్చుకుంటున్నారా? అంటే.. తాజాగా ఉత్త‌రప్ర‌దేశ్ లో జ‌రిగిన ఘ‌ట‌న ఔన‌నే అనిపిస్తోంది. విష‌యం పెద్ద‌దై.. దేశం మొత్తం విస్త‌రించే లోపే.. యూట‌ర్న్ తీసుకుని.. ఒకింత చ‌ల్ల‌బ‌రిచే ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే కొంత‌లో కొంత ఊర‌ట‌. ఇంతకీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుత ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇక్క‌డ గెలుపు గుర్రం ఎకక్కాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇందిర‌మ్మ మ‌న‌వ‌రాలు.. రాజీవ్ కుమార్తె ప్రియాంక గాంధీ అన్నీతానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అభ్య‌ర్థుల ఎంపిక నుంచి మేనిఫెస్టో మ‌దింపు వ‌ర‌కు కూడా ప్రియాంక చూసుకుంటున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. యూపీ కాంగ్రెస్‌ను అన్నీ తానై ప్రియాంక న‌డిపిస్తున్నారు. అయితే, ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన జాబితాలో ప్రియాంక పోటీ చేయ‌డం లేదు. కానీ, ఒక‌వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి క‌నుక వ‌స్తే.. ముఖ్య‌మంత్రి ఎవ‌రు అవుతారు? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిగా స్పందించారు. "ఇంకెవ‌రు నేనే" అంటూ.. ప్రియాంక అత్యుత్సాహం చూపించారు. ఇది దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. అన్ని మీడియాల్లోనూ ఈ వార్త సంచ‌ల‌నంగా ప్ర‌చారం అయింది. దీంతో కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుంద‌ని ఆశించిన‌.. ఆ పార్టీ నేత‌ల‌కు పెద్ద శ‌రాఘాతం త‌గిలింది.

తెలతెల వారుతూనే బీజేపీ నేత‌లు కాంగ్రెస్‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేశారు. "ఢిల్లీ గ‌ద్దెపై కాంగ్రెస్ ఆశ‌లు వదిలేసుకుంది. మోడీ ఢీ కొట్టే స‌త్తా లేక‌.. రాష్ట్రాల స్థాయికి దిగ‌జారిపోయింది. ఇప్పుడు ముఖ్య‌మంత్రి స్థాయికి..రేపు వార్డు స్థాయికి దిగ‌జారిపోవ‌డం.. ఖాయం" అంటూ.. బీజేపీ పెద్ద‌లే ట్వీట్లు చేశారు. ఇక‌, యూపీలో ప్ర‌ధాన ప‌క్షం బీజేపీ నేత‌లు కూడా ఇంటింటికీ.. ఇదే విష‌యా న్ని ప్ర‌చారం చేస్తున్నారు. మోడీని ఢీ కొట్టే స‌త్తాలేకే.. యూపీలో ముఖ్య‌మంత్రి పీఠం కోసం దేబిరిస్తున్నారు! అంటూ.. యూపీ బీజేపీ నేత‌లు వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ హ‌వా ఒక్క‌సారిగా ప‌డిపోయింది. ఇది జాతీయ రాజ‌కీయాల‌పై పెను ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఏర్ప‌డింది.

ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు గాంధీ వార‌సులు కానీ, గాంధీ కుటుంబం కానీ.. రాష్ట్రాల స్థాయిలో చ‌క్రాలు తిప్పారే త‌ప్ప‌.. ముఖ్య‌మంత్రులుగా చేసింది లేదు. ఒక‌ర‌కంగా ముఖ్య‌మంత్రి అంటే.. గాంధీల కుటుంబానికి అత్యంత చిన్న‌పోస్టు. అలాంటి పోస్టు ను ప్రియాంక కోరుకోవ‌డం అంటే.. కాంగ్రెస్ స‌త్తాను మ‌రింత త‌గ్గించేసిన‌ట్టే అవుతుంద‌ని.. కాంగ్రెస్ సీనియ‌ర్లు కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డ కాంగ్రెస్ పార్టీ వెంట‌నే దిద్దుబాటుకు దిగింది. యూపీ సీఎం అభ్యర్థి తానేనంటూ బిగ్‌ హింట్ ఇచ్చిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఆ అభ్యర్థిని తాను కాదంటూ తన మాటల్ని ఉపసంహరించుకున్నారు.

'కాంగ్రెస్ తరఫున నేను యూపీ సీఎం అభ్యర్థినని చెప్పలేదు. మీరు పదేపదే అదే ప్రశ్న అడగుతుండంతో.. చిరాకుగా అనిపించింది. అందుకే అన్ని చోట్లా నేనే కనిపిస్తున్నాగా అన్నాను' అంటూ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడుతూ..'దాని గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు వెల్లడిస్తాను' అని చెప్పారు. మొత్తానికి ప్రియాంక మ‌న‌సులో ఏమున్నా.. సీఎం స్థాయి అంటే.. కాంగ్రెస్ ఇప్పుడున్న ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారుతుంద‌నే వ్యాఖ్య‌ల నేప‌థ్యంలోనే ప్ర‌యాంక వెన‌క్కి త‌గ్గార‌ని.. జాతీయ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ వివాదం ఇక్క‌డితో స‌మ‌సి పోతుందో లేక కొన‌సాగుతుందో చూడాలి.