Begin typing your search above and press return to search.

తేయాకు తోటలో అంతలా కష్టపడిన ప్రియాంక

By:  Tupaki Desk   |   2 March 2021 10:33 AM GMT
తేయాకు తోటలో అంతలా కష్టపడిన ప్రియాంక
X
ఎన్నికలు వచ్చేస్తే చాలు.. చాలానే సిత్రాలు దర్శనమిస్తుంటాయి. దక్షిణాదిన ఎన్నికలు జరుగుతున్న కేరళ.. తమిళనాడు.. పుదుచ్చేరిని కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ కవర్ చేస్తుంటే.. ఆయన సోదరి ఈశాన్యన ఎన్నికలు జరుగుతున్న అసోం రాష్ట్రంలో చురుగ్గా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆమె పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా తేయాకు తోటలో ఆకుల్ని తుంచే క్రమంలో.. అక్కడి కార్మికుల మాదిరి తయారై.. పని చేయటం అందరిని ఆకర్షించేలా చేసింది.

టో తోటలోకి వెళ్లిన ప్రియాంక అక్కడి కూలీలతో కలిసి పని చేశారు. తల మీద గుడ్డ పెట్టుకొని.. నుదుటికి బ్యాండ్ కట్టుకొని.. తేయాకు వేసేందుకు బుట్టను వీపు వెనుక పెట్టుకొని.. నడుముకు ఏప్రాన్ కట్టుకొని ఆకును తెంచే పనిని శ్రద్ధగా చేయటం పలువురిని ఆకర్షించేలా చేసింది. బిశ్వనాథ్ ప్రాంతంలో సాధురు టీ ఎస్టేట్ లో ఆమె కూలీలతో మాట్లాడారు. తేయాకుకూలీలు అసోంతో పాటు ఈ దేశానికి చాలా విలువైన వారని.. వారి హక్కుల్ని పరిరక్షించేందుకు.. వారికి గుర్తింపు తెచ్చేందుకు కాంగ్రెస్ ఎల్లవేళలా పోరాడుతూ ఉంటుందన్నారు.

ఐదేళ్ల క్రితం వరకు అసోంలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా వెలిగింది. అయితే.. పక్కా వ్యూహంతో అసోంలో అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. బలమైన క్యాడర్ ను తయారు చేసుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ మరణించటం.. అంత బలమైన నాయకుడు పార్టీకి లేకపోవటంతో ఇప్పుడా రాష్ట్రంలో అధికారంలో కోసం విపరీతంగా శ్రమిస్తోంది.ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో ప్రచారం చేయటానికి వెళ్లిన ప్రియాంక తన మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

తేయాకు తోటల్లో పని చేసే కార్మికులు ఆ రాష్ట్రంలోని 35 అసెంబ్లీ స్థానాల్ని ప్రభావితం చేయనున్నారు. అందుకే కాబోలు.. అంత కష్టానికి ఓర్చి తేయాకు తోటలో ఆమె పని చేశారని చెప్పాలి. ‘మీ భయాలు.. కలలు అవగాహన చేసుకోవటానికి మేం ప్రాధాన్యం ఇస్తాం’ అంటూ ఆమె తేయాకు కార్మికులకు భరోసా ఇస్తున్నారు. ఒక ట్వీట్ లో తేయాకు కార్మికుల నిరాడంబర జీవితం..వారి శ్రమను వివరిస్తూ.. వారిని కొనియాడారు. తన పట్ల వారు ప్రదర్శించిన అభిమానాన్ని ఎప్పటికి మర్చిపోలేనన్నారు. మార్చి 27 నుంచి మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఓపినియన్ పోల్స్ లో మాత్రం.. అసోంలో బీజేపీకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. ప్రియాంక ప్రచారం ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.