Begin typing your search above and press return to search.

హత్రాస్ ఘటనపై ప్రియాంక పోరు కంటిన్యూస్... అందరూ గొంతెత్తాల్సిందేనట

By:  Tupaki Desk   |   2 Oct 2020 6:29 PM GMT
హత్రాస్ ఘటనపై ప్రియాంక పోరు కంటిన్యూస్... అందరూ గొంతెత్తాల్సిందేనట
X
ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకున్న హత్రాస్ అత్యాచార ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తనదైన శైలి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎక్కడికక్కడ అడ్డంకులు ఎదురవుతున్నా... ప్రియాంక మాత్రం వెనకడుగు వేసేందుకు సిద్ధంగా లేరు. హత్రాస్ నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయడంతో పాటుగా తీవ్ర దిగ్భ్రాంతిలో కూరుకుపోయిన బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రియాంక నిజంగానే తనదైన మార్కు పోరాటానికి తెర తీశారు. హత్రాస్ బాధిత కుటుంబానికి యావత్తు దేశం అండగా నిలవాల్సిన అవసరం ఉందని, అందరూ గొంతెత్తాలని కూడా ప్రియాంక తనదైన మార్కు పిలుపునిచ్చారు.

గురువారం హత్రాస్ వెళ్లేందుకు బయలుదేరిన రాహుల్ గాంధీ, ప్రియాంకలను పోలీసులు అడ్డగించిన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కరోనా నిబంధనలు పాటించకుండా హత్రాస్ కు బయలుదేరారంటూ రాహుల్, ప్రియాంకలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏకంగా కేసులు కూడా నమోదు చేశారు. అయినా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గని ప్రియాంక... శుక్రవారం ఢిల్లీలోని వాల్మీకి ఆలయంలో హత్రాస్ బాధిత కుటుంబానికి సంఘీభావంగా జరిగిన ప్రార్తన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రియాంక... ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా బాదిత కుటుంబానికి అండగా నిలవడం ఎంత అవసరమన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

ప్రార్థనా సమావేశంలో ప్రియాంక ఏమన్నారంటే... హత్రాస్ బాధితురాలికి, ఆమె కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతి భారతీయుడు గొంతెత్తాలి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి ఎలాంటి సహాయం అందేలు. ప్రస్తుతం ఆ కుటుంబం ఒంటరితనంతో బాధపడుతోంది. అయితే బాధిత కుటుంబం గానీ, వాల్మీకి కమ్యూనిటీ గానీ తాము ఒంటరితనంతో ఉన్నామని భావించరాదు. యావత్తు దేశం మీకు అండగా ఉంది. హత్రాస్ బాధిత కుటుంబానికి మద్దతుగా అందరూ గొంతెత్తాలి. ప్రభుత్వంపై మీడియా ఒత్తిడి తీసుకురావాలి. మనమంతా రాజకీయంగా ఒత్తిడి తీసుకురావాలి. ప్రతి మహిళ ఈ విషయంలో ముందుకు రావాలి. బాధితురాలి అంత్యక్రియలకు ఆమె తండ్రిని, సోదరుడిని కూడా అనుమతించకపోవడం దుర్మార్గం. ఈ తరహా యత్నాలు మన సంస్కృతికే విరుద్ధం. దీనిని ఏ ఒక్కరూ ఉపేక్షించకూడదు’’ అని ప్రియాంక తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా హత్రాస్ బాధిత కుటుంబానికి అండగా తానున్నానని, ఈ విషయంపై ప్రభుత్వ చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ప్రియాంక గట్టిగానే చెప్పేశారు.