Begin typing your search above and press return to search.

ఇప్ప‌టికి ప్రియాంక ఇంత‌కు మించి ఏం చెబుతుంది?

By:  Tupaki Desk   |   24 July 2019 7:38 AM GMT
ఇప్ప‌టికి ప్రియాంక ఇంత‌కు మించి ఏం చెబుతుంది?
X
దేశ రాజ‌కీయాల మీద అవ‌గాహ‌న ఉన్న వారెవ‌రూ కూడా ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోరు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఇప్పుడు బాధితురాలిగా క‌నిపిస్తూ.. అయ్యో పాపం అన్న దీన‌స్థితిలో ఉన్న కాంగ్రెస్.. ఒక‌ప్పుడు ఎన్ని చేయ‌కూడ‌ని ప‌నులు చేసిందో చెప్ప‌లేని ప‌రిస్థితి. కాకుంటే అప్ప‌ట్లో కాంగ్రెస్ దేనికైనా బ‌రితెగింపునే న‌మ్ముకున్న‌ట్లుగా క‌నిపిస్తే.. ఇప్పుడు ఆ బాట‌లో అన్నిపార్టీలు ప‌య‌నిస్తున్నాయి. అందుకు భిన్నంగా మ‌డి క‌ట్టుకొని ఉన్న పార్టీలు చాలా చాలా అరుదుగా చెప్పాలి.

క‌ర్ణాట‌క‌లో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిన ఎపిసోడ్ కు సంబంధించి తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. తాజాగా ఆమె త‌న ఆవేద‌న‌ను ట్వీట్ రూపంలో సంధించారు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్రియాంక ఇంత‌కు మించి మ‌రేమీ చేయ‌లేని ప‌రిస్థితి.

గ‌తంలో సంకీర్ణ ప్ర‌భుత్వాలే కాదు.. త‌మ ప్ర‌త్య‌ర్థుల ప్ర‌భుత్వాల్ని ఎంత నిర్దాక్షిణ్యంగా కుప్ప‌కూల్చిన ఘ‌న చ‌రిత్ర కాంగ్రెస్ సొంత‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోలేం. త‌మ తాత‌లు.. నానమ్మ‌లు చేసిన త‌ప్పుల గురించి ప్రియాంక గాంధీ మ‌ర్చిపోయారేమో కానీ.. తాజాగా క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ప‌రిణామాల‌పై మాత్రం ఆమె ఆగ్ర‌హావేశాల్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌తిదీ కొన‌లేం.. ప్ర‌తి ఒక్క‌రిని బెదిరించ‌లేం.. ప్ర‌తి అబ‌ద్ధం బ‌య‌ట‌ప‌డే రోజు త‌ప్ప‌క వ‌స్తుంది. త్వ‌ర‌లోనే బీజేపీ ఈ విష‌యాన్ని గ్ర‌హిస్తుంద‌ని ఆమె ట్వీట్ చేశారు.

అంతేకాదు.. ప్ర‌జ‌లు భ‌రించినంత వ‌ర‌కే నాయ‌కుల అంతులేని అవినీతి అని ప్ర‌జా ప్ర‌యోజ‌నాల్ని కాపాడే సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేయ‌టం.. ప్ర‌జాస్వామ్యాన్ని బ‌ల‌హీన‌ప‌ర్చ‌టం లాంటి అంశాలు కొన‌సాగుతాయ‌న్నారు. ఒక్క‌సారి ప్ర‌జ‌ల్లో స‌హ‌నం న‌శిస్తే..ఎలాంటి నాయ‌కుడైనా తుడిచిపెట్టుకుపోతాడ‌ని ట్వీట్ చేశారు.

తాజాగా ఆమె చేసిన ట్వీట్ల టార్గెట్ ఎవ‌రన్న విష‌యం అంద‌రికి తెలిసిందే అయినా.. ఇప్పుడు ఇన్ని నీతులు చెబుతున్న ప్రియాంక‌మ్మ‌.. త‌మ పార్టీ గ‌తంలో చేసిందేమిట‌న్న మాట‌ను ప్ర‌శ్నిస్తే స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. అందుకేనేమో.. రాజకీయంగా కాకుండా.. వేదాంత ధోర‌ణిలో ట్వీటు చేయ‌టం క‌నిపిస్తుంది. అక్క తీరుకు భిన్నంగా రాహుల్ కాస్త దూకుడుగా రియాక్ట్ అయ్యారు. బీజేపీ దురాశ ముందు నిజాయితీ.. ప్ర‌జాస్వామ్యం.. క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల తీర్పు కుప్ప‌కూలింద‌న్నారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి రోజు నుంచి త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింద‌ని ఆయ‌న ఆరోపించారు. మ‌న నాన‌మ్మ‌.. నాన్న‌లు చేసిందే ఇప్పుడు మోడీ చేశార్లే రాహుల్!