Begin typing your search above and press return to search.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకా గాంధీ

By:  Tupaki Desk   |   23 Jan 2019 9:45 AM GMT
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకా గాంధీ
X
యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ కూతురు ప్రియాంకా గాంధీ ఇప్పటివరకు తెరవెనుక ఉండి ఎన్నికల ప్రచారం చేశారు. సోనియాగాంధీ ఏఐసీసీ పదవి నుంచి తప్పుకున్నాక ఆమె అన్న రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెల్సిందే. ఇక ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతుండటం విశేషం.

ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ కేవలం ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలికే పరిమితమై ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ కోసమే ఆమె ప్రచారం నిర్వహించేవారు. ఇక రాహుల్ గాంధీ ఏఐసీసీ బాధ్యతలు స్వీకరించాక 2014తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగైంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

త్వరలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యధిక లోక్ సభ స్థానాలు కలిగిన యూపీ పైనే రాహుల్ దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా యూపీలో యోగీ ఆదిత్య నాథ్ కు చెక్ పెట్టేలా ప్రియాంక గాంధీని రంగంలోకి దింపుతున్నారు. ఈ మేరకు ఆమెను యూపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ చరిష్మా ఉపయోగపడుతుందని రాహుల్ భావిస్తున్నారు. ప్రియాంకకు తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను హైకమాండ్ అప్పగించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింధియాను నియమించారు. ఇక యూపీ జనరల్ సెక్రెటరీగా ఉన్న గులాం నబీ ఆజాద్ ను హర్యానా జనరల్ సెక్రటరీగా హైకమాండ్ నియమించింది.

మోడీ-యోగీకి ధీటుగా రాహుల్-ప్రియాంక కాంబినేషన్ సెట్ అయింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపుతుంది. ఈ ఉత్సాహంతోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లి విజయదుందుభి మోగించాలని రాహుల్ భావిస్తున్నారు. మరీ కాంబినేషన్ లో రాజకీయ ప్రచారం ఎలా ఉంటుందో వేచి చూడాల్సింది.